ఎస్సీ,ఎస్టీలకు ఇచ్చేవన్నీ ముస్లింలకు కూడా ఇస్తాం: కెసిఆర్

November 09, 2017


img

శాసనసభలో నిన్న మైనార్టీ సంక్షేమంపై జరిగిన చర్చలో మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ప్రతిపాదనలలో దాదాపు అన్నిటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజు ఆమోదం తెలిపారు. ఓవైసీ ప్రతిపాదనలకు కెసిఆర్ ప్రతీ ఒక్క అంశంపై సవివరంగా జవాబులు ఇచ్చారు. ఓవైసీ అడిగినవే కాకుండా అధనంగా అనేక వరాలు కూడా ప్రకటించారు.

తెలంగాణాలో ఉర్దూ బాషను రెండవ అధికార బాషగా చేస్తున్నట్లు ప్రకటించారు. ముస్లిం గురుకుల పాఠశాలలు, ఇతర ప్రభుత్వ పాఠశాలలలో ఉర్దూ భోధన కోసం ఉర్దూ ఉపాద్యాయుల నియామకానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పారు.   

రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, స్పీకర్, మండలి చైర్మన్, రాష్ట్ర డిజిపి తదితరులందరి కార్యాలయాలలో ఉర్దూ బాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపడానికి, ముస్లిం ప్రజలకు సంబంధించిన ఇతర వ్యవహారాల కోసం ఒక్కో ఉర్దూ అధికారి చొప్పున మొత్తం 66 మందిని రెండు నెలలోగా నియమించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఎటువంటి అర్హతలు ఉండాలో నిర్ణయించే బాధ్యతను ఉర్దూ మండలికే అప్పగిస్తామని చెప్పారు.  

ప్రస్తుతం రాష్ట్రంలో ముస్లింలకు కేవలం 4 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలులో ఉన్నందున, ఇక నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసిలకు ఇచ్చే అన్ని ప్రయోజనాలను, ప్రభుత్వ పధకాలను ముస్లింల కూడా వర్తింపజేస్తామని ప్రకటించారు.

అక్బరుద్దీన్ ఓవైసీ కోరినట్లు వివిధ జిల్లాలలో వక్ఫ్ బోర్డు భూములలో ముస్లిం విద్యార్ధుల కోసం స్టడీ సెంటర్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, మహిళాసాధికారత కేంద్రాలకు అవసరమైన భవనాలను నిర్మిస్తామని ప్రకటించారు. 

అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ కోరినట్లు, పాతబస్తీలో వక్ఫ్ బోర్డుకు చెందిన లక్ష అడుగులకు పైగా విస్తీర్ణం గల భవనంలోకి ముస్లిం మైనార్టీలకు సంబంధించిన అన్ని కార్యాలయాలను తరలించే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. దీని కోసం ఉప ముఖ్యమంత్రి మహ్మూద్ఈ ఆలీ ఈరోజు కానీ రేపు గానీ వీలుచూసుకొని ఆ భవనాన్ని పరిశీలిస్తారని, ఆయన చెప్పిన దానిని బట్టి తగిన నిర్ణయం తీసుకొంటానని చెప్పారు.  

ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, తాను ఆ మాటను ఎన్నికలను, ముస్లిం ఓటర్లను దృష్టిలో పెట్టుకోనో లేక వారిని కితకితలు పెట్టడానికో అనలేదని, వారికి తప్పనిసరిగా మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆ హామీని ఇచ్చానని, అందుకే వెంటనే దాని కోసం శాసనసభలో బిల్లు కూడా ఆమోదించి కేంద్రానికి పంపించామని చెప్పారు. ఈ విషయం గురించి తాను నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతోనే చర్చించానని, ఆయన కూడా దీనిపై సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ఒకవేళ కేంద్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోతే మొదట దీని గురించి పార్లమెంటు సమావేశాలలో కేంద్రంపై ఒత్తిడి చేస్తామని అప్పటికీ అంగీకరించకపోతే సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. 

ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికలు, ముస్లిం ఓటు బ్యాంక్ ను లేదా మజ్లీస్ పార్టీతో పొత్తుల కోసమో ఇవన్నీ ప్రకటించారో లేదో తెలియదు కానీ ఈరోజు శాసనసభలో ఆయన ముస్లింల సంక్షేమంపై చేసిన ప్రసంగం...దానిలో ఆయన ముస్లింలపై కనబరిచిన అవ్యాజ్యమైన అభిమానం, వారి సంక్షేమం కోసం ఆయన ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యల గురించి విన్నట్లయితే, రాష్ట్రంలో ముస్లిం ప్రజలు మజ్లీస్ పార్టీని కూడా కాదని తెరాసకు ఓటు వేయడం ఖాయం అని చెప్పవచ్చు. అంత అద్భుతంగా అయన ప్రసంగించారు.  


Related Post