కోమటిరెడ్డి మనసులో మాట

November 08, 2017


img

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ ఈరోజు తన మనసులో మాటను మరోసారి బయటపెట్టారు. హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “నాకు పిసిసి అధ్యక్ష పదవి కావాలని నేరుగా రాహుల్ గాంధీనే అడిగాను. ఆ పదవికి నేను అన్నివిధాల అర్హుడినే కనుక దానిని కోరుకోవడం తప్పు కాదని భావిస్తున్నాను,” అని అన్నారు. నల్లగొండలో తెరాస అభ్యర్ధిని మీరు ఓడించగలరా? అనే విలేఖరి ప్రశ్నకు “నా స్వంత నియోజకవర్గంలోనే నేను తెరాస అభ్యర్ధిని ఓడించలేకపోతే ఇక రాష్టంలో తలెత్తుకొని తిరుగలేను. నల్లగొండ జిల్లాలో నేను ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. ఏ ఇతర పార్టీ గెలువలేదని ఖచ్చితంగా చెప్పగలను,” అని సమాధానం చెప్పారు. 

నల్లగొండ జిల్లాలో తెరాస అభ్యర్ధిని కోమటిరెడ్డి ఓడించగలరా లేదా అనే విషయం ఎన్నికలు జరిగినప్పుడే తెలుస్తుంది కనుక ఇప్పుడు దాని గురించి ఆలోచించడం అనవసరం. కానీ నేటికీ ఆయన పిసిసి అధ్యక్ష పదవి కావాలని కోరుకోవడం గమనిస్తే, అయన అసంతృప్తితో రగిలిపోతున్నారని అర్ధం అవుతోంది. ఇదివరకు ఒకసారి అయన నేరుగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనే ఘాటుగా విమర్శలు చేశారు. అయన నేతృత్వంలో తను పనిచేయలేనని, తక్షణం ఆయనను ఆ పదవిలో నుంచి తప్పించకపోతే తాము వేరే దారి చూసుకొంటామని తమ పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ పదవిలో నుంచి దించలేదు పైగా ఇకపై ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, అయన నిర్ణయాలను ఎవరు ధిక్కరించినా సహించబోనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా గట్టిగా హెచ్చరించడంతో కోమటిరెడ్డి వెనక్కు తగ్గవలసి వచ్చింది. 

ఈరోజు మళ్ళీ పిసిసి అధ్యక్ష పదవి గురించి మాట్లాడటంతో, ఆ పదవిపై కోమటిరెడ్డి ఇంకా ఆశలు వదులుకోలేదని, ఆ కారణంగా అసంతృప్తిగా ఉన్నారనే సంగతి స్పష్టం అయ్యింది. కాంగ్రెస్ అధిష్టానం అయన అసంతృప్తిని పట్టించుకోకపోతే ఏదో ఒకరోజు అయన వేరే పార్టీలోకి గోడ దూకేయడం ఖాయం. అలాగని అయన కొరుకొంటున్నట్లుగా పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టలేదు. కనుక బంతి కోమటిరెడ్డి కోర్టులోనే ఉన్నట్లు భావించవచ్చు. మరి అయన ఏమి చేస్తారో చూడాలి. 


Related Post