కృతజ్ఞతలు..వందనాలతో కడుపు నిండుతుందా?

November 08, 2017


img

గత ఏడాది నవంబర్ 8న పాత పెద్దనోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆ నిర్ణయం తీసుకొని నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా, నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా తన ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సమర్ధించినందుకు దేశప్రజలందరికీ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ‘ఈ నిర్ణయాత్మక యుద్ధంలో 125 కోట్ల మంది భారతీయులు కలిసికట్టుగా పోరాడారు...విజయం సాధించారు. ఇది చాలా చారిత్రాత్మకం, బహుళ ప్రయోజక విజయం.అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఈ నిర్ణయాత్మక యుద్ధంలో పాల్గొన్నందుకు దేశప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను,’ అని ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ నోట్లరద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు, మొదట దేశవ్యాప్తంగా చాలా కలకలం మొదలైనప్పటికీ, దేశ ప్రజలందరూ ఆయనపై అపారనమ్మకంతో దేశం కోసం అనేకరోజుల పాటు నోట్ల కష్టాలను పంటిబిగువున భరించారు. నోట్లరద్దుపై ప్రతిపక్షాలు ఎంతగా రాద్దాతం చేస్తున్నప్పటికీ దేశప్రజలు వారితో కలిసి ఆందోళనబాట పట్టలేదు...పట్టి ఉంటే ఏమయి ఉండేదో ఊహించుకోవడం కూడా కష్టం. భారతదేశ చరిత్రలో ‘నభూతో నభవిష్యత్’ అన్నట్లుగా, దేశంలో అత్యధిక శాతం ప్రజలు మోడీ సర్కార్ కు మద్దతు పలికారు. కనుక మోడీ సర్కార్ దేశప్రజలకు చాలా రుణపడి ఉందని చెప్పక తప్పదు. 

కానీ మోడీ సర్కార్ అందుకు కృతజ్ఞతగా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చేసిందేమీ కనబడటం లేదు. నిత్యావసర వస్తువులు మొదలు వారు వినియోగించే కూరగాయలు, వస్తువులు, సేవలపై ధరలు అమాంతం పెరిగిపోయాయి. కోట్లాదిమంది సామాన్య ప్రజలు నేడు ఈ అధిక ధరలను భరించలేక విలవిలలాడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 

అయితే నేటికీ నోట్లరద్దుతో సామాన్యులు ఏమీ ప్రతిఫలం ఆశించడంలేదు. నోట్లరద్దు, జి.ఎస్.టి.లతో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయే లేదో వారికి తెలియదు కానీ తమ బ్రతుకు ఇంకా భారం కాకుండా సాగిపోతే చాలనుకొంటున్నారు. కానీ వారి ఆ చిన్న కోరిక కూడా నేడు తీరే పరిస్థితి కనబడటం లేదు. 125 కోట్ల మంది పాల్గొన్న ఈ నిర్ణయాత్మక యుద్ధంలో చివరికి సామాన్యులు ఓడిపోయారు..కార్పోరేట్ సంస్థలు, రాజకీయ నాయకులు, పార్టీలు విజేతలుగా నిలిచాయి. అటువంటప్పుడు మోడీ ‘ట్వీట్ కృతజ్ఞతలు ట్వీట్ సలాములు’ వారు ఏమి చేసుకోవాలి?  


Related Post