ఆహా..ఏమి టైమింగ్..పాపం భాజపా ఎలా నెగ్గుకొస్తుందో?

November 08, 2017


img

నోట్ల రద్దు జరిగి నేటికి ఏడాది. సరిగ్గా ఏడాది క్రితం అంటే నవంబర్ 8,2016 రాత్రి 8 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాత పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆకారణంగా దేశప్రజలు ఎదుర్కొన్న చేదు అనుభవాలు, దేశంలో వివిధ వ్యవస్థలపై దాని ప్రభావం, తరువాత జరిగిన అనేక ఆర్ధిక, రాజకీయ పరిణామాల గురించి అందరికీ తెలుసు కనుక మళ్ళీ ఇప్పుడు వాటిని వల్లె వేసుకోనవసరం లేదు. నోట్లరద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు, భాజపా వ్యతిరేక పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ ఈరోజు ‘బ్లాక్-డే‘ పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయబోతున్నాయి.

నోట్ల రద్దు..దాని ప్రయోజనాల గురించి మొదట గట్టిగా మాట్లాడిన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, భాజపా నేతలు తదితరులు ఆ నిర్ణయం బెడిసికొట్టడంతో ఆ తరువాత దాని గురించి మాట్లాడటం మానుకొన్నారు. కానీ ఈరోజు తప్పనిసరిగా మళ్ళీ గట్టిగా మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే, భాజపాకు చాలా కీలకమైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలకు పోలింగ్ త్వరలో జరుగబోతున్నాయి. 

ప్రతిపక్షాలు ఈరోజు నోట్లరద్దును నిరసిస్తూ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తే ఆ ప్రభావం ఆ రెండు రాష్ట్రాల ప్రజలపై కూడా పడుతుంది. పరిశ్రమలు, వ్యాపారాలకు పెట్టింది పేరైన గుజరాతీయులు కూడా నోట్లరద్దు వలన చాలా నష్టపోయున్నారు. కనుక ఈరోజు జరుగబోయే నిరసన కార్యక్రమాలతో ఇప్పుడిప్పుడే మానుతున్న వారి గాయాలను మళ్ళీ రేపినట్లు అవుతుంది కనుక వారు భాజపాకు వ్యతిరేకంగా ఓట్లు వేసే ప్రమాదం ఉంటుంది. అందుకే కేంద్రప్రభుత్వం, కేంద్రమంత్రులు, భాజపా నోట్లరద్దు నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకొంటూ మాట్లాడవలసివస్తోంది. 

నోట్లరద్దు వలన కలిగిన ప్రయోజనాల గురించి కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నిన్న మాట్లాడారు. నోట్లరద్దు చాలా సాహసోపేతమైన నిర్ణయమని, దాని వలన దేశంలో కోట్లాది రూపాయల నల్లధనం వెలికి తీయగలిగామని చెప్పారు.      దాని వలన కలిగిన ఆర్ధిక మార్పులు, ప్రయోజనాలను వివరిస్తూ ఆర్ధికశాఖ గణాంకాలు విడుదల చేసింది. నేడు నల్లధనం వ్యతిరేక దినంగా పాటించాలని భాజపా పిలుపునిచ్చింది. అయితే అది ప్రతిపక్షాలు చేపడుతున్న ‘బ్లాక్-డే’ అందోళనల ప్రభావం తగ్గించడానికేనం వేరే చెప్పనవసరం లేదు. 

ఏది ఏమైనప్పటికీ, సరిగ్గా నోట్లరద్దు అమలులోకి వచ్చిన రోజునే భాజపాకు ఎంతో కీలకమైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల పోలింగ్ కు ముహూర్తంగా ఎన్నికల కమీషన్ నిర్ణయించడం భాజపాకు ఊహించని కొత్త సవాలుగా మారిందని చెప్పక తప్పదు. 


Related Post