జగన్ కు చట్టసభలపై గౌరవం లేదా?

November 07, 2017


img

ఈనెల 10వ తేదీ నుంచి సుమారు వారంరోజుల పాటు ఏపి శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు జరుగబోతున్నాయి. కనుక సభ్యులందరూ విధిగా వాటికి హాజరు కావలసిన బాధ్యత వారిపై ఉంది. కానీ ఏపిలో ఏకైక ప్రతిపక్ష పార్టీ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీ నుంచి ఆరు నెలలపాటు సాగే ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో పాదయాత్రకు బయలుదేరారు. అంటే ఆయన శాసనసభ సమావేశాలకు హాజరు కారని స్పష్టం అయింది. కనుక ఆయన శాసనసభ సమావేశాల కంటే తన పార్టీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నట్లు అర్ధం అవుతోంది. తన పాదయాత్రకు ‘ప్రజా సంకల్పయాత్ర’ అని పేరు పెట్టుకొన్నప్పటికీ, అది వచ్చే ఎన్నికలలో తన పార్టీ విజయం సాధించి అధికారంలో రావడం కోసమే చేస్తున్న రాజకీయ యాత్ర అని ఆయన ప్రసంగాలను విన్నట్లయితే అర్ధం అవుతుంది. ఇంకా ఏడాదిన్నర తరువాత జరుగబోయే ఎన్నికల గురించి జగన్ ఇప్పుడే ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు జరుగబోయే శాసనసభ సమావేశాలలో పాల్గొనడం తన కనీస బాధ్యత అని భావించకపోవడం గమనిస్తే ఆయనకు చట్టసభలపై, వాటి సమావేశాలపై గౌరవం లేదని స్పష్టం అవుతోంది. 

చట్టసభల సమావేశాలకు హాజరుకావడానికి ఇష్టపడని ఆయన, అదే చట్టసభలలో మెజారిటీ సీట్లు సాధించుకొని అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో ఈ పాదయాత్రకు పూనుకోవడం విచిత్రంగా ఉంది. శాసనసభ సమావేశాలకు హాజరయ్యి ప్రజా సమస్యలపై చర్చించడానికి ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి, తనను ఎన్నికలలో గెలిపించాలని తనకు అధికారం ఇవ్వాలని ప్రజలను కోరుతుండటం హాస్యాస్పదంగా ఉంది. 

ఇదివరకు జరిగిన శాసనసభ సమావేశాలు 10 రోజులు నిర్వహించాలని ఏపి సర్కార్ నిర్ణయించినప్పుడు, ‘ప్రజా సమస్యలపై చర్చించడానికి అవి ఏమాత్రం సరిపోవు కనీసం మూడు నాలుగువారాలైన నిర్వహించాలని’ వైకాపా పట్టుబట్టేది. కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించకపోతే, ‘శాసనసభ సమావేశాలు నిర్వహించాలంటే ప్రభుత్వానికి హడల్ అందుకే అది ఏదో మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించేసి తప్పించుకొంటోందని’ వైకాపా నేతలు ఆరోపించేవారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ‘కేవలం వారం రోజుల పాటు జరిగే సమావేశాలకు జగన్ హాజరుకాలేరా? వాటి కోసం తన పాదయాత్రను వాయిదా వేసుకోలేరా? శాసనసభ సమావేశాల కంటే పాదయాత్రే ముఖ్యమా?’ అని తెదేపా నేతలు నిలదీస్తుంటే, జగన్ వారి ప్రశ్నలను, విమర్శలను పట్టించుకోకుండా పాదయాత్ర చేసుకొంటున్నారు. 

అయన శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోయినా, కోర్టు ఆదేశాల మేరకు ప్రతీ శుక్రవారం విధిగా సిబిఐ కోర్టు విచారణకు హాజరుకాక తప్పదు. ఈ విషయాన్ని కూడా రేపు తెదేపా నేతలు హైలైట్ చేయకుండా ఉంటారా? కనుక ఇప్పటికైనా జగన్ తన పాదయాత్రను వాయిదా వేసుకొని 10వ తేదీ నుంచి జరుగబోయే శాసనసభ సమావేశాలకు హాజరయితే ఆయనకే గౌరవప్రదంగా ఉంటుంది లేకుంటే ఆయన వలన పార్టీకి కూడా అప్రదిష్ట కలగడం ఖాయం.   


Related Post