ఇక వెనక్కు తిరిగే ప్రసక్తే లేదుట

November 07, 2017


img

కోలీవుడ్ నటుడు కమల్ హాసన్ తన రాజకీయ ప్రవేశం గురించి ఈరోజు మరోసారి స్పష్టత ఇచ్చారు. “ఇంతవరకు వచ్చిన తరువాత ఇక వెనుదిరిగే ప్రసక్తే లేదు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సి ఉంది కనుక నేను ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం ఖాయం. అయితే పార్టీ నిర్మాణానికి మరికొంత సమయం పడుతుంది. ఈలోగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్రమంతటా పర్యటిస్తాను. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, కష్టాలు మొదలైనవన్నీ తెలుసుకొని అవగాహన పెంచుకొంటాను. అవినీతి రహితమైన ప్రభుత్వం, పాలన అందించడమే లక్ష్యంగా పార్టీని నిర్మించుకొంటాను. అందుకోసం సమాజంలో మేధావులు, నా అభిమానులు, ప్రజల నుంచి అవసరమైన సలహాలు తీసుకొంటాను. నా అభిమానులు అందరూ ప్రజాసేవా కార్యక్రమాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. హిందువులలో అతివాదుల గురించి నేను మాట్లాడితే, హిందువులు తీవ్రవాదులని నేను అన్నట్లుగా వక్రీకరించారు. నా అభిమానులు నన్ను మిగిలిన నటులకంటే నన్ను కాస్త ఎక్కువగా అభిమానించినట్లుగానే, హిందువులలో కూడా ఉంటారని చెప్పడమే నా ఉద్దేశ్యం. అందుకు కొందరు నాపై కేసులు పెట్టడం బెదిరించడం సరికాదు. అటువంటి బెదిరింపులకు నేను భయపడేది లేదు,” అని కమల్ హాసన్ అన్నారు. 

పార్టీ నిర్మాణం కోసం నిధుల సమీకరణకు, అభిమానులు తనతో సంప్రదించేందుకు కమల్ హాసన్ ఇవ్వాళ్ళ ఒక మొబైల్ యాప్ ను ప్రారంభించారు. 


Related Post