సభలో ప్రభుత్వాన్ని నిలదీయలేక..

November 07, 2017


img

తెలంగాణా శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల తీరు చూస్తుంటే, శీతాకాల సమావేశాలు మొదలయ్యే ముందు రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు వారిని ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్యలు నిజమేననిపిస్తుంది. “మా ప్రభుత్వం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సమావేశాలు నిర్వహించడానికి సిద్ధం ఉంది. ప్రతిపక్షాలు అడిగే ఏ ప్రశ్నకైన మేము సమాధానాలు చెప్పడానికి సిద్దంగా ఉన్నాము. కానీ మమ్మల్ని సభలో నిలదీసి ప్రశ్నించడానికి ప్రతిపక్షాల వద్ద ఎటువంటి అంశమూ లేదు. అందుకే సమావేశాల మొదటిరోజునే కాంగ్రెస్ పార్టీ ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడి కార్యక్రమం పెట్టుకొని సభకు రాకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది,” అని అన్నారు. 

హరీష్ రావు ఆరోపించినట్లుగానే, ప్రతిపక్షాలు రోజూ ఏదో ఒక అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వడం, దానిని స్పీకర్ అనుమతించలేదనే సాకుతో సభలో కాసేపు రభస చేసి వాక్ అవుట్ చేసి వెళ్ళిపోవడం పరిపాటిగా మారిపోయింది. శాసనసభలో వారి సమక్షంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర మంత్రులు గత ప్రభుత్వాల పాలనలో లోపాలను ఎత్తిచూపి ఎండగడుతుంటే ఏమీ చేయాలోపాలుపోక, ఏదో వంకతో బయటకు వచ్చేసి ‘ప్రభుత్వం మాకు శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మా గొంతు నొక్కేస్తోంది. స్పీకర్ తెరాస ప్రతినిధిలాగ వ్యవహరిస్తున్నారు,’ అంటూ పిర్యాదులు చేస్తున్నారు. 

ఇవ్వాళ్ళ టిటిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కూడా శాసనసభ నుంచి బయటకు వచ్చేసి ఇంచుమించు అదేవిధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కలిసి శాసనసభను రాష్ట్ర ప్రభుత్వ ప్రచారవేదికగా మార్చేశారు. సభలో ఎంతసేపు వారే గంటలుగంటలు మాట్లాడుతారు కానీ మాట్లాడేందుకు మాకు అవకాశం ఇవ్వడం లేదు. స్పీకర్ తెరాస ప్రతినిధిలాగ వ్యవహరిస్తున్నారు. అయన తీరు మార్చుకోవాలి,” అని అన్నారు.  


Related Post