రెవెన్యూ వ్యవస్థ సమూల ప్రక్షాళన చేస్తా: కెసిఆర్

November 07, 2017


img

శాసనసభలో ఈరోజు భూముల సర్వే సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. “గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ తీరుతెన్నులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రికార్డులలో కనిపిస్తున్న భూములకు, వాస్తవంగా కనిపిస్తున్న భూములకు కొలతలలో, యాజమాన్యపు హక్కులలో చాలా తేడాలున్నాయి. అలాగే రెవెన్యూశాఖ రికార్డులకు, వ్యవసాయ రికార్డులకు మళ్ళీ చాలా వ్యత్యాసం ఉంది. ఇక రిజిస్టార్ కార్యాలయానికి వెళితే అక్కడి పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో, అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. వాటిని శాసనసభలో చెప్పుకోలేము. అందుకే ఈ లోపాలను అన్నిటినీ సమూలంగా ప్రక్షాళన చేయడానికే ఈ భూసర్వే, రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణల కార్యక్రమాలు మొదలుపెట్టాము. 

సామాన్య రైతులకు సైతం తమ భూముల లావాదేవీలు సులువుగా చేసుకోనేంత వీలుగా, వారికి సైతం సులువుగా అర్ధం చేసుకోగలిగినంత సరళమైన బాషలో భూరికార్డులు రూపొందించడమే లక్ష్యంగా అవసరమైన చర్యలు తీసుకొంటున్నాము. అలాగే రెవెన్యూ శాఖలో అట్టడుగు స్థాయి నుంచి పైస్థాయి వరకు ప్రతీ కార్యాలయంలో ఒక ఐటి అధికారిని నియమించాలని నిర్ణయించాము. అందుకోసం కొత్తగా 1,000 మంది ఐటి నిపుణులను నియమించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేను. వారి నియామకాలు జరిగితే ప్రతీ స్థాయిలో రెవెన్యూ రికార్డులు ఎప్పటికప్పుడు అప్-డేట్ అవుతూ, భూక్రయవిక్రయలకు సంబంధించిన అన్ని వివరాలు ఆన్-లైన్ లో లభిస్తాయి. తద్వారా యావత్ వ్యవస్థలో జరిగే పనులకు పూర్తి పారదర్శకత వస్తుంది. 

వీటన్నిటినీ పూర్తి చేయడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ ఒకసారి ఈ లోటుపాట్లన్నీ సరిచేసిన తరువాత ఎటిఎంలో డబ్బు, రశీదు వచ్చినంత సులువుగా రెవెన్యూ వ్యవస్థలో పనులు జరుగుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం, మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు. గ్యాంగ్ స్టార్ నయీం ఆక్రమించుకొన్న భూములతో సహా రాష్ట్రంలో ఎటువంటి భూములపైనైనా ప్రతిపక్షాలతో చర్చకు సిద్దంగా ఉన్నాము,” అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. 


Related Post