భాజపా వ్యూహం మార్చిందా?

November 06, 2017


img

తమిళనాడులో నిలద్రొక్కుకొని, ఆ రాష్ట్రంలో కూడా భాజపా జెండా ఎగురవేయడానికి కేంద్రప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో, ఇప్పుడు ప్రధానప్రతిపక్ష పార్టీ డిఎంకెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తునట్లుంది. తమిళ పత్రిక దినంతి ప్లాటినం జూబ్లీ వేడుకలలో పాల్గొనడానికి ఈరోజు చెన్నై వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోడీ, గోపాలపురంలో కరుణానిధి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించివచ్చారు. 

గత 11 నెలలుగా అధికార అన్నాడిఎంకెలోని పన్నీర్ సెల్వం, పళనిస్వామికి తెర వెనుక నుంచి కేంద్రప్రభుత్వం ఎంతగా మద్దతు ఇస్తున్నప్పటికీ, ఇంతవరకు వారిరువురూ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెర దించలేకపోయారు. ఈ కారణంగా అన్నాడిఎంకె ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత నెలకొని ఉంది. 

త్వరలో ప్రత్యక్ష రాజకీయలలోకి వచ్చేందుకు సిద్దపడుతున్న కమల్ హాసన్ కూడా అధికారంలో ఉన్న ఒక చెత్త ప్రభుత్వమని, త్వరలో దానిని తొలగించవలసిన అవసరం ఉందని చెపుతున్నారు. పనిలోపనిగా దానితో పరోక్షంగా అంతకాగుతున్న భాజపాకు కూడా అయన చురకలు వేస్తున్నారు. 

ఇక తమిళనాడులో తన ఉనికిని చాటుకోవడానికి కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమాను రాష్ట్ర భాజపా వ్యతిరేకించడం కూడా బెడిసికొట్టినట్లే ఉంది. ఈ కారణంగా కూడా అటు ప్రజలలో, వారిపై తీవ్రప్రభావం చూపగల సినీ ఇండస్ట్రీలో కూడా భాజపా వ్యతిరేక వాతావరణం కనిపిస్తోంది. 

కనుక ఇటువంటి వ్యతిరేక పరిస్థితులలో తమిళనాడులో భాజపా నిలబడాలంటే, ఏదో ఒక ప్రాంతీయపార్టీ అండ తప్పనిసరి. కనుక మళ్ళీ డిఎంకె పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నంలోనే ప్రధాని మోడీ కరుణానిధిని కలిసి ఉండవచ్చు. అయితే 2019 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలలో భాజపా దేనితో చేతులు కలుపుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం. 


Related Post