కోదండరాం పార్టీ పెడితే ఏమవుతుంది?

November 06, 2017


img

తెలంగాణా రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన ఆదివారం ఘాట్ కేసర్ లో టిజెఏసి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దానిలో పాల్గొన్న సభ్యులు టిజెఏసి ద్వారా ఆశించిన మార్పులు తీసుకురావడం కష్టమని, కనుక రాజకీయ పార్టీ స్థాపించడం చాలా ఆవసరమని గట్టిగా నొక్కి చెప్పారు. అయితే ప్రొఫెసర్ కోదండరాం అందుకు అంగీకరించలేదు. ముందుగా క్షేత్రస్థాయిలో టిజెఏసి బలోపేతం అయితేనే అటువంటి ఆలోచనలు చేయడం సాధ్యం అవుతుందని నచ్చచెప్పారు. రైతు సమస్యలు, ఉద్యోగాల భర్తీ వంటి సమస్యలపై మనం చేస్తున్న పోరాటాలను తెరాస సర్కార్ ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజలను వాటిని గుర్తిస్తున్నారని, కనుక క్షేత్రస్థాయిలో మరింత ఉదృతంగా పోరాటాలు కొనసాగించవలసిన అవసరం ఉందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 

అంటే ఆయన పార్టీ పెట్టేందుకు తొందరపడటం లేదని స్పష్టం అయ్యింది. కానీ టిజెఎసి నేతలు రాజకీయ పార్టీ స్థాపనకై ఆయనపై  ఒత్తిడి చేయడం గమనిస్తే, వారికీ పదవులు, అధికారంపై ఆశలుంటాయని కనుక ఎల్లకాలం పోరాటాలకే పరిమితం కావాలంటే సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. కనుక ఒకవేళ ప్రొఫెసర్ కోదండరాం త్వరలో రాజకీయపార్టీ స్థాపనపై నిర్ణయం తీసుకొని పక్షంలో వారు క్రమంగా ఆయనకు దూరం అయ్యే అవకాశాలున్నాయి. 

అయన కాంగ్రెస్ పార్టీకి కాస్త సన్నిహితంగా మెసులుతున్నారు కనుక అటువంటి పరిస్థితే ఎదురైతే టిజెఎసిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయవచ్చు లేదా వచ్చే ఎన్నికలలో దానికి మేలు కలుగుతుందంటే రాజకీయపార్టీని స్థాపనకు సిద్దపడవచ్చు. ఒకవేళ అయన స్వంత పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశిస్తే, దాని వలన తెరాస ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది. కనుక వచ్చే ఎన్నికలనాటికి, అప్పటి పరిస్థితులను బట్టి ఆయన రాజకీయ నిర్ణయం తీసుకోవచ్చు.


Related Post