బంగారి తెలంగాణా దిశలో మరోముందడుగు

November 06, 2017


img

తెలంగాణా ఏర్పాటు కోసం తెరాస అధినేతగా కేసిఆర్ ఎంతగా పోరాడారో, రాష్ట్రం ఏర్పడిన తరువాత బంగారి తెలంగాణా లక్ష్యంగా పెట్టుకొని, దశాబ్దాలుగా తెలంగాణాకు జరిగిన అన్యాయాలను, తెలంగాణా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సరిచేసేందుకు మరో నిశబ్ద ఉద్యమం చేపట్టారు. ఆ దిశలో ఇప్పటికే అనేక అడుగులు పడ్డాయి. సోమవారం అర్ధరాత్రి మరొక ముందడుగు పడబోతోంది. అదే..వ్యవసాయ రంగానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందించడం. 

ఇప్పటికే పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలలో ప్రయోగాత్మకంగా 24X7 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఆ ప్రయోగం విజయవంతం అవడంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్రమంతటా సుమారు వారం రోజులపాటు ప్రయోగాత్మకంగా 24X7 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయబోతున్నారు విద్యుత్ అధికారులు. ఈ ప్రయోగంలో ఎదురయ్యే సమస్యలను, లోటుపాట్లను పరీక్షించుకొని సవరించుకొన్న తరువాత త్వరలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలలో వ్యవసాయ పంప్ సెట్లకు నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా మొదలవుతుంది. 

దీని కోసం ఈ మూడేళ్ళలో రూ.12,000 ఖర్చు చేసి ఎక్కడికక్కడ ట్రాన్స్ ఫార్మర్లు, సబ్-స్టేషన్లు, విద్యుత్ లైన్లు వగైరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 23 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు సుమారు 11,500 మెగావాట్స్ విద్యుత్ వినియోగించుకొంటాయి. ఇదికాక సాధారణ గృహావసరాలకు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మొదలైనవాటికి అదనపు విద్యుత్ అవసరం ఉంటుంది. కనుక నేటి నుంచి వ్యవసాయ రంగానికి ప్రయోగాత్మకంగా 24X7 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేసి, డిమాండ్, సప్లై లెక్కలు సరిచూసుకొని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖ నిర్ణయించుకొంది. 

2018 మార్చి-ఏప్రిల్ నెలల నుంచి ఎట్టిపరిస్థితులలో 24X7 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడంతో విద్యుత్ శాఖ అధికారులు తదనుగుణంగానే శరవేగంగా బారీ ఏర్పాట్లు చేసుకొంటూ ముందుకు సాగుతున్నారు. 



Related Post