అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం మళ్ళీ తెరపైకి

November 04, 2017


img

రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ సీట్ల పెంపు జరుగుతుందో లేదో తెలియదు కానీ ఆ వ్యవహారం మూడడుగులు ముందుకు, ఆరడగులు వెనక్కి అన్నట్లు సాగుతూనే ఉంది. దీనిని ముట్టుకొంటే తేనె తుట్టెను కదిలించినట్లవుతుందని కేంద్రప్రభుత్వం భయపడుతుంటే, రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్ధపార్టీలను బలహీనపరచడానికి ఫిరాయింపులు ప్రోత్సహించి, అనేకమందిని పార్టీలలో చేర్చుకొన్నాయి కనుక టికెట్స్ ఆశిస్తున్నవారందరినీ సంతృప్తిపరచడానికి శాసనసభ సీట్ల పెంచాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఎవరి సమస్యలు, భయాలు వారికున్నాయి కనుక ఈ వ్యవహారం తేలడం లేదు.

అయితే సీట్లపెంపు అనేది రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి, అధికార పార్టీలు మరింత బలపడటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యేలు పెరిగితే వారి వలన ప్రజలకు కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోయినా వారి జీతభత్యాల అదనపు భారం మాత్రం భరించక తప్పదు. అయితే రాజుగారు తలుచుకొంటే కొరడా దెబ్బలకు కరువేమిటి? అన్నట్లుగా అధికారంలో ఉన్నవారు తమకు మేలుచేకూర్చుకోదలిస్తే వారిని ఆపగలిగేవారెవరు? 

ఇంతకీ విషయం ఏమిటంటే, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నిన్న డిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి సీట్ల పెంపుగురించి మాట్లాడగా అయన సానుకూలంగా స్పందించారని తెదేపా నేతలతో అన్నట్లు సమాచారం. ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గుజరాత్ ఎన్నికల తరువాత ఈ వ్యవహారంపై కేంద్రప్రభుత్వం తాడోపేడో తేల్చేయబోతోందని అన్నారు. కనుక ఇద్దరు ముఖ్యమంత్రులు సీట్లు పెరుగుతాయని నమ్మకంగా చెపుతున్నారు కనుక మళ్ళీ ఆశావహుల్లో ఆశలు చిగురించి ఉంటాయి. కానీ ఒకవేళ సీట్లు పెరుగకపోతే వారి పరిస్థితి ఏమిటి? ఆ విషయం వారే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. 


Related Post