ఉట్టికి ఎగురలేనమ్మ...

November 03, 2017


img

ఉట్టికి ఎగురలేనమ్మ..స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది టిటిడిపి నేతల మాటలు. వారికి గట్టి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా వచ్చే ఎన్నికలలో విజయం సాధించి తెలంగాణాలో అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే ఏవిధంగా రాగలమని అనుకొంటున్నారో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను ప్రభుత్వాసుపత్రిగా మారుస్తామని టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ చెప్పారు.

ఒకపక్క పార్టీ ఖాళీ అయిపోతుంటే ఏమీ చేయలేక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కూర్చోని నిస్సహాయంగా చూస్తూ మళ్ళీ ఇటువంటి మాటలు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తమ బలహీనతను, పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి ఆటుపోట్లు తాము గతంలో చాలా ఎదుర్కొని నిలబడ్డామని, ఇప్పుడూ అలాగే నిలబడి పోరాడుతామని అన్నారు. ఇక నుంచి ప్రజలతో మరింత మమేకమై ప్రజాసమస్యలపై తెరాస సర్కార్ తో పోరాడుతామని చెప్పారు.

మోత్కుపల్లి నరసింహులు వంటి సీనియర్ నేత తెరాసతో పొత్తులు పెట్టుకోవడం మంచిదని చెపుతుంటే, రమణ తెరాసతో పోరాడుతామని చెప్పడం విచిత్రంగా ఉంది. ప్రజాసమస్యలపై పోరాడినవారందరికీ ప్రజలు ఓట్లేసే అధికారం కట్టబెడతారనుకొంటే, ఏపిలో వైకాపాకు కూడా ఓటేస్తారని టిటిడిపి నేతలు అంగీకరించగలరా? కనుక వచ్చే ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్ పార్టీలను డ్డీ కొనే ఉద్దేశ్యం ఉన్నట్లయితే ఈవిధంగా ఏవో కబుర్లతో తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నాలు చేస్తూ కాలక్షేపం చేయడం కంటే, మళ్ళీ పార్టీ క్యాడర్ ను, వ్యూహాలను సిద్దం చేసుకోవడం మంచిది కదా. 


Related Post