కొండా సురేఖ జన్మజన్మల బంధం స్టోరీ

November 03, 2017


img

ఒకప్పుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జమానాలో ఒక వెలుగు వెలిగిన మహిళా నేతలలో కొండా సురేఖ కూడా ఒకరు. అయన పోయిన తరువాత ఆయనపై అభిమానంతో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని, తెలంగాణా ఉద్యమాలకు దూరంగా ఉండిపోయారు. కానీ రాష్ట్ర విభజన జరుగబోతున్నట్లు జగన్ పసిగట్టగానే, తెలంగాణాలో కొండంత అండగా ఉన్న కొండా సురేఖతో సహా తనను నమ్ముకొన్న వైకాపా నేతలందరినీ నడిరోడ్డుపై విడిచిపెట్టి ఆంధ్రాకు వెళ్ళిపోయారు. ఆ కారణంగా కొండా సురేఖవంటి అనేకమంది నేతల రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది. 

చివరికి కొండా సురేఖ తెగించి తెరాసలో చేరి మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగారు కానీ ఆనాటి తన పూర్వ వైభవం మాత్రం సంపాదించుకోలేకపోయారు. మంత్రిపదవి ఆశించి భంగపడ్డారు. కనుక మళ్ళీ కాంగ్రెస్ పార్టీవైపు చూస్తున్నారని ఆ మద్యన గుసగుసలు వినిపించాయి. అయితే ఆమె అటువంటి ప్రయత్నమేదీ చేయలేదు. నేటికీ తెరాసనే అంటిపెట్టుకొని ఉన్నారు. 

ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల సీజన్ మొదలైంది కనుక ఆమె కాంగ్రెస్ గూటికి చేరుకోబోతున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఆ ఊహాగానాలు నిజమైతే వాటితో ఆమెకు ఇబ్బందేమీ ఉండదు కానీ తెరాసలోనే కొనసాగాలనుకొంటే చాలా ఇబ్బందికరపరిస్థితులు ఎదురవుతాయి. కనుక ఆమె ఈ వార్తలపై స్పందిస్తూ “నాకు రాజకీయ జన్మనిచ్చినవారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిగారు. నాకు రాజకీయ పునర్జన్మ నిచ్చినవారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కనుక తెరాసను విడిచిపెట్టిపోయే ప్రసక్తే లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని ప్రచారం చేస్తూ కాంగ్రెస్ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు. వాస్తవానికి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది. అధికారంలో ఉన్న పార్టీని వదులుకొని అటువంటి పార్టీలోకి ఎందుకు వెళతాను? మీడియాలో వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లే. వాటిని నేను ఖండిస్తున్నాను. నేను ఎప్పటికీ తెరాసలోనే ఉంటాను,” అన్నారు కొండా సురేఖ.       



Related Post