కమల్ ఒక ఉగ్రవాదివంటివాడు: భాజపా

November 03, 2017


img

కాంగ్రెస్ పై విమర్శలు చేయాలంటే అవినీతి ప్రస్తావన చేయాల్సి వచ్చినట్లుగానే, భాజపాను విమర్శించాలంటే హిందుత్వం గురించి వేలెత్తి చూపడం పరిపాటిగా మారిపోయింది. అలాగే సెక్యులరిజం గురించి మాట్లాడాలంటే హిందువులను, హిందూమతాన్ని విమర్శించడం కూడా పరిపాటిగా మారిపోయింది.    

త్వరలో ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్న ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్, తాను భాజపాను దాని మతతత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నానని చెప్పుకోవడం కోసమో లేక తాను సెక్యులర్ అని చాటి చెప్పుకోవడానికో హిందువులపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు.

“ఒకప్పుడు హిందువులు ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకొందామనుకొనేవారు. కానీ ఈరోజుల్లో హిందువులు కూడా బలప్రదర్శన ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలనుకొంటున్నారు. ఆ ప్రయత్నంలో కొందరు ఉగ్రవాదంవైపు కూడా మొగ్గు చూపుతున్నారు. కనుక ఇప్పుడు హిందువులు కూడా ఉగ్రవాదానికి అతీతులని భావించలేము,” అని ఒక తమిళ పత్రికకు వ్రాసిన వ్యాసంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అయితే ఇప్పుడు ప్రభుత్వాలే సహనం కోల్పోతున్నప్పుడు, నిత్యం సమస్యలకు ఎదురీదుతూ బ్రతుకు భారంగా గడుపుతున్న సామాన్య ప్రజలు, తమ సమస్యలను పాలకుల చెవిన పడేందుకు నిరసనలు, ఆందోళనలు చేయాక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడినమాట వాస్తవం. వారిలో మరికొందరు మరో అడుగు ముందుకు వేసి, ఇతర మతాల ప్రజలపై తమ ప్రతాపం చూపిన సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. కానీ అంత మాత్రాన్న హిందువులు ఉగ్రవాదంవైపు మళ్ళుతున్నారని లేదా ‘హిందూ ఉగ్రవాదం’ అని కమల్ హాసన్ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

రాజకీయ నేతలు కూడా హిందువులే అయినప్పటికీ ‘సెక్యులర్ బ్యాడ్జి’ కోసం హిందువులను, హిందూమతాన్ని విమర్శించడం ఫ్యాషన్ గా మారిపోయింది. కమల్ హాసన్ ఇంకా రాజకీయాలలో అడుగుపెట్టకుండానే ‘సెక్యులర్ బ్యాడ్జి’ తగిలించుకోవడం కోసం పడుతున్న ఆరాటం చూస్తుంటే, అంత పేరున్న వ్యక్తి ఇంతగా దిగజారిపోవాలా? అనిపించక మానదు. 

ఆయన వ్యాఖ్యలు తమను ఉద్దేశ్యించి చేసినవిగానే భావించిన భాజపా, అందుకు ధీటుగానే సమాధానం చెప్పింది. భాజపా జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “గత దశాబ్దకాలంగా కాంగ్రెస్ హయంలో ముస్లిం ఓటు బ్యాంకు కోసం హిందువులను చులకనచేసి మాట్లాడటం, కించపరుస్తూ మాట్లాడటం పరిపాటిగా మారిపోయింది. లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్, మాజీ కేంద్రమంత్రులు పి.చిదంబరం, సుషీల్ కుమార్ షిండేలకు ఈ అలవాటు ఎక్కువగా ఉండేది. వారి దారిలోనే కమల్ హాసన్ కూడా నడుస్తున్నట్లున్నారు. కనుక కమల్ హాసన్ ఒక లష్కర్ ఉగ్రవాదివంటివాడని భావించవచ్చు. ఆయనకు ఎర్ర చొక్కాలు ధరించడం అంటే చాలా ఇష్టం అంటారు. కానీ పొరుగునే ఉన్న కేరళలో ఎర్రచొక్కా నేతలు చేస్తున్న దురాగతాలు ఆయన కళ్ళకు కనిపిస్తున్నట్లు లేవు. అందుకే వారి గురించి మాట్లాడటం లేదు ,” అని అన్నారు. 


Related Post