తుమ్మల అనుచరుడు కాంగ్రెస్ లోకి జంప్?

November 03, 2017


img

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అనుచరుడు పోట్ల నాగేశ్వరరావు త్వరలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు శుక్రవారం ఖమ్మంలో ప్రకటించారు. ఇంతకు ముందు అయన, తుమ్మల ఇద్దరూ తెదేపాలో ఉండేవారు. ఆ తరువాత అయన తుమ్మలతో బాటు తెరాసలో చేరారు. తుమ్మలకు మంత్రిపదవి లభించింది కానీ ఆయనకు మాత్రం పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి ప్రాధాన్యత లభించకపోవడంతో గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడంతో ఆయన కూడా దానిలోకి వెళ్ళేందుకు ఆసక్తి చూపారు. వచ్చే ఎన్నికలలో ఆయనకు ఖమ్మం నుంచి శాసనసభకు పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈరోజు ఆయన ఈనెల 8వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు విస్పష్టంగా ప్రకటించారు. త్వరలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పారు. 

ఒకపక్క కాంగ్రెస్, తెదేపా నేతలను తెరాసలోకి ఆకర్షిస్తుంటే మరోపక్క తెరాస నుంచి కాంగ్రెస్ లోకి వలసలు మొదలవడం విశేషమే. వచ్చే ఎన్నికలలో 99 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్స్ లభిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో, ఇంతకాలం టికెట్ కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులు అందరూ మెల్లగా తట్టాబుట్టా సర్దుకోవడం మొదలుపెట్టడం సహజమే. కనుక రానున్న రోజులలో ఇంకా అనేకమంది తెరాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసే అవకాశాలున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్స్ కోసం గట్టిపోటీయే ఉంటుంది కనుక, అక్కడ కూడా టికెట్స్ లభించని పక్షంలో కొందరు భాజపావైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. బలమైన అభ్యర్ధుల కోసం తలుపులు తెరుచుకొని ఎదురుచూస్తున్న భాజపాలోకి ఇప్పుడు ఎంతమంది వచ్చినా ‘ఆకామిడేట్’ చేయగలదు. కనుక కాంగ్రెస్, తెరాసల తరువాత అందరికీ నెక్స్ట్ ఆప్షన్ భాజపాయే. 


Related Post