బాబు కొండను త్రవ్వారా?

November 03, 2017


img

రేవంత్ రెడ్డి రాజీనామా, టిటిడిపి శ్రేణుల పార్టీ ఫిరాయింపులతో అప్రమత్తమైన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో గురువారం విస్తృతస్థాయి పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా నలుమూలల నుంచి బారీగా తెదేపా శ్రేణులు తరలివచ్చాయి. తీవ్ర సంక్షోభంలో చిక్కుకొన్న టిటిడిపిని ఏవిధంగా నిలబెట్టుకోవాలనే విషయంపై చంద్రబాబు, పార్టీలో సీనియర్ నేతలతో వేరేగా చర్చించి ఉండవచ్చు. అయితే ఆ వివరాలను చాటింపు వేసుకోలేరు కనుక కార్యకర్తలను ఉద్దేశ్యించి ఊకదంపుడు ప్రసంగం చేసి ఉండవచ్చు.

అయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “ఇదివరకు కూడా మనం అనేకసార్లు ఒడిడుకులు..తీవ్ర సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కొన్నాము. ఇప్పుడు మరోసారి ధైర్యంగా ఎదుర్కొందాము. పార్టీలో అందరూ కష్టపడిపనిచేయండి..ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించకండి. అవి దగ్గర పడినప్పుడు ఏమి చేయాలో నేను చెపుతాను. మన పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది తప్ప ఎన్నికల కోసం కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు నాకు సమానమే. అందుకే రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని పోరాడాను. ఒక్కసారి పిలవగానే ఈ సమావేశానికి ఇంతమంది తరలివచ్చారు. మీ అందరినీ చూస్తుంటే నా కడుపు నిండిపోయింది,” అని అన్నారు. 

చంద్రబాబు గంటకు పైగా చేసిన ప్రసంగంలో అందరికీ తెలిసిన విషయాలే మాట్లాడి బోర్ కొట్టించారు. టిటిడిపిని కాపాడుకొనేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయలేదు. ‘అందరూ కష్టపడి పనిచేయండి’ అని ఉచిత సలహా ఇచ్చారు. అలాగే ఈ సంక్షోభానికి ప్రధానకారణమైన పొత్తుల విషయాన్ని కూడా ‘దాని గురించి ఆలోచించడానికి ఇది తగిన సమయం కాదంటూ’ దాట వేశారు. ‘ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి ప్రజాస్వామ్యయుతంగా పోరాడి గెలిచాము’ అనే మాట చంద్రబాబు నోట విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇదితప్ప ఆయన ప్రసంగంలో కొత్తగా చెప్పినదేమీ లేదు. అంటే చంద్రబాబు కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు చెప్పవచ్చు.

అయితే ఈ సమావేశం నిర్వహణకు వేరే కారణం, ప్రయోజనం ఉన్నాయని చెప్పవచ్చు. మొదటిది రేవంత్ రెడ్డి, కొంతమంది టిటిడిపి నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయినా టిటిడిపి బలహీనపడలేదని కాంగ్రెస్, తెరాసలకు చాటి చెప్పడం. పార్టీలో మిగిలిన నేతలకు ఎంత బలం ఉందో చూపించే బలప్రదర్శనగా దీనిని చెప్పుకోవచ్చు. అలాగే అంతమంది కార్యకర్తలను ఈ సమావేశానికి రప్పించడం ద్వారా, వారిలో ‘పార్టీలో మీరు ఒంటరివారు కారు..మీతో బాటు ఇంతమంది పనిచేస్తున్నారు,’ అని ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నంగా చూడవచ్చు. ఏమైనప్పటికీ, ఈ ప్రయత్నాలతో టిటిడిపిని కాపాడుకోవడం సాధ్యం కాదని చెప్పకతప్పదు. 


Related Post