నేను రాజీనామా చేయనక్కరలేదు..ఎందుకంటే...

November 02, 2017


img

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై స్పందించమని విలేఖరులు అడిగినప్పుడు, “ఆయన రాజీనామా పెద్ద విషయమేమీ కాకపోయినా దాని గురించి మీడియాలో చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ అయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందజేస్తే కొడంగల్ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరుగుతాయి. దానిలో తెరాసతో సహా అన్ని రాజకీయపార్టీలు కూడా పాల్గొంటాయి,” అని అన్నారు. 

తన రాజీనామా విషయం గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “నేను తెదేపాను వీడినప్పుడే నా పదవికి కూడా రాజీనామా చేశాను. అయితే ఆ తరువాత తెదేపా ఎమ్మెల్యేలు అందరూ తెరాసలో చేరిపోవడంతో తెదేపా లెజిస్లేటివ్ పార్టీ తెరాసలో విలీనం అయిపోయింది కనుక ఇక నేను రాజీనామా చేయనవసరం లేకుండాపోయింది,” అని అన్నారు.

తెలంగాణాలో నేటికీ తెదేపా తన ఉనికిని చాటుకొంటుండగా, తెదేపా తెరాసలో విలీనం అయిపోయిందనే తలసాని వాదన చాలా హాస్యాస్పదంగా ఉంది. అయన వాదనే నిజమనుకొంటే అసెంబ్లీ ఎమ్మెల్యేల జాబితాలో అయనను తెరాస ఎమ్మెల్యే అని పేర్కొని ఉండాలి. కానీ నేటికీ అయన తెదేపా ఎమ్మెల్యేగానే గుర్తింపు పొందుతున్నారు. కనుక నైతికవిలువల గురించి మాట్లాడదలిస్తే మొట్టమొదట ఆయనే తెదేపా ద్వారా సంపాదించుకొన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. 


Related Post