ఆ విషయంలోనూ భాజపాకు అయోమయమేనా?

November 01, 2017


img

బైసన్ పోలో గ్రౌండ్స్ లో కొత్త సచివాలయం నిర్మాణం గురించి భాజపా, తెరాసల మద్య ఇవ్వాళ్ళ శాసనసభలో వాగ్వాదాలు జరిగాయి. పాతది ఉండగా కొత్తది ఎందుకని భాజపా, కొత్తది నిర్మిస్తే తప్పేమిటని తెరాస వాదించుకొన్నాయి. 

ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి చాలా స్పష్టంగానే ఉన్నారు. కానీ భాజపాయే అయోమయంలో ఉందని చెప్పకతప్పదు. 

కొత్త సచివాలయం కట్టడానికి బైసన్ పోలో గ్రౌండ్స్ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధానమంత్రి, రక్షణమంత్రితో మాట్లాడి ఒప్పించారు. కనుక కొత్త సచివాలయ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాల సహకరిస్తోందని అర్ధం అవుతోంది. కానీ రాష్ట్ర భాజపా నేతలు బైసన్ పోలో గ్రౌండ్స్ లో కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఈ అంశంపై భాజపా అధిష్టానం, రాష్ట్ర భాజపా నేతలు వైఖరి వేర్వేరుగా ఉన్నాయని స్పష్టం అవుతోంది.

ఒకవేళ రాష్ట్ర భాజపా నేతలు దాని నిర్మాణం జరుగకూడదని కోరుకొంటున్నట్లయితే, ఈ వ్యవహారంపై తాము ఎటువంటి వైఖరితో ముందుకు సాగుతున్నామో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వివరించి ఆయన ద్వారా కేంద్రాన్ని ఒప్పించి రక్షణశాఖ బైసన్ పోలో గ్రౌండ్స్ ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించకుండా అడ్డుకోవచ్చు. కానీ ఆ మైదానం రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే అర్ధం  ఈవిషయమై రాష్ట్ర భాజపా నేతలు తమ అధిష్టానాన్ని సంప్రదించలేదని, లేదా సంప్రదించినా వారిని పట్టించుకోలేదని భావించవలసి ఉంటుంది.  

ఇక రాష్ట్ర భాజపా నేతలు కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నమని శాసనసభలో స్పష్టం చేసినప్పుడే దానికి ప్రధాని నరేంద్ర మోడీ చేత శంఖుస్థాపన చేయిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం రాష్ట్ర భాజపా నేతలకు చెంపదెబ్బ వంటిదే. రాష్ట్రంలో తమ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారని తెలిసున్నప్పటికీ ఒకవేళ ప్రధాని మోడీ దానికి శంఖుస్థాపనకు చేస్తే, కేంద్రం, భాజపా అధిష్టానం దృష్టిలో రాష్ట్ర భాజపా నేతలకు ఎటువంటి విలువా లేదని భావించవలసి ఉంటుంది. 

కనుక రాష్ట్ర భాజపా నేతలు ముందుగా తమ పట్ల, రాష్ట్రంలో పార్టీ పట్ల తమ అధిష్టానం అభిప్రాయం, వైఖరి ఏమిటో తెలుసుకొన్నాక కార్యాచరణ నిర్ణయించుకొంటే మంచిదేమో? లేకుంటే వారే ప్రజల ముందు..తమ రాజకీయ ప్రత్యర్ధుల ముందు నవ్వులపాలవుతారు.  



Related Post