తెలంగాణా నెంబర్: 1, భారత్: 100 మంచిదే కానీ..

November 01, 2017


img

వ్యాపారాలు నిర్వహించుకోవడంలో సులభతరం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకులను ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. దానిలో భారత్ కు 100 వ స్థానం దక్కింది. 2013లో 131వ స్థానంలో ఉన్న భారత్, 2014-134, 2015-142, 2016-131, 2017-130 స్థానాలలో ఉండగా, ‘డూయింగ్‌ బిజినెస్‌ 2018: రిఫామింగ్ టు క్రియేట్ జాబ్స్- 2018’ వార్షిక నివేదిక ప్రకటించే సమయానికి 100వ స్థానానికి చేరుకొందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ఇక భారత్ లో తెలంగాణా రాష్ట్రం నెంబర్: 1 స్థానంలో నిలువగా, తెలంగాణాలో హైదరాబాద్ నెంబర్: 1 స్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది.

వ్యాపార స్థాపన, నిర్వహణ, మూసివేతల వ్యవహారాలకు సంబంధించి 2016-17 సంవత్సరాలలో భారత ప్రభుత్వం చేపట్టిన 10 ముఖ్యమైన సంస్కరణల వలన, భారత్ లో వ్యాపారం కొంత సులభతరం అయ్యిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో ప్రపంచదేశాలలో న్యూజిలాండ్ నెంబర్: 1 స్థానంలో నిలువగా, దాని తరువాత స్థానాలలో వరుసగా సింగపూర్, డెన్మార్క్, దక్షిణ కొరియా, హాంకాంగ్, అమెరికా, రష్యా, బ్రిటన్ దేశాలు నిలిచాయి. విశేషమేమిటంటే కటినమైన చట్టాలు కలిగి మంచి క్రమశిక్షణ, కటోరశ్రమ చేసే దేశంగా పేరున్న చైనా ఈసారి కూడా తన 78వ స్థానం నిలబెట్టుకోగలిగింది కానీ తన ర్యాంకింగ్ మరింత మెరుగుపరుచుకోలేకపోయింది. సుమారు 130 కోట్ల మంది జనాభా, క్రమశిక్షణారాహిత్యం, అడుగడుగునా అవినీతి, లంచగొండితనం, రెడ్-టేపిజం వంటి సకల అవలక్షణాలతో కునారిల్లుతున్న భారత్ మాత్రం ఒకేసారి 30 పాయింట్లు మెరుగుపరుచుకొని 130 నుండి 100 కు చేరుకోగలిగింది. 

ఇది జి.ఎస్.టి. అమలులోకి వచ్చిన తరువాత రూపొందించిన నివేదిక కాదని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. కనుక వచ్చే ఏడాదిలో భారత్ ర్యాంక్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. 

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఈ సంస్కరణల కారణంగా దేశంలో పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహించుకోవడానికి ఇపుడిప్పుడే కాస్త సానుకూల వాతావరణం ఏర్పడుతుండటం చాలా సంతోషకరమైన విషయమే. అయితే కాగితాల మీద కనిపిస్తున్న ఈ సానుకూల వాతావరణం వాస్తవంగా కూడా ఉందా లేదా? వాస్తవ పరిస్థితులు ప్రపంచ బ్యాంక్ నివేదికకు పొంతన ఉందా లేదా? అని నిజాయితీగా పరిశీలించుకోవడం కూడా చాలా అవసరమే. 

అయితే తెలంగాణా రాష్ట్రం, రాజధాని హైదరాబాద్ విషయంలో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంక్ లను ఏమాత్రం సందేహించనవసరం లేదనే చెప్పవచ్చు. గత మూడేళ్ళలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న అనేక చిన్నా పెద్దా, జాతీయ, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, పరిశ్రమలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తున్నాయి. అయితే ఇక ముందు కూడా ఇది నిబద్దతో, దృడదీక్షతో, క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుంది అప్పుడే మన ర్యాంకులు ఇంకా మెరుగుపడే అవకాశం ఉంటుంది.   


Related Post