టిటిడిపి వికెట్లు పడుతూనే ఉన్నాయి

November 01, 2017


img

రేవంత్ రెడ్డి రాజీనామా తరువాత టిటిడిపిలోవరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. బహుశః మరికొన్ని రోజులు పడుతూనే ఉండవచ్చు. టిటిడిపి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చుక్కల ఉదయ చందర్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో పార్టీని కాపాడుకొంటూ ప్రజాప్రతినిధులను గెలిపించుకోవడం చాలా కష్టమని అందుకే పార్టీ నుంచి తప్పుకొంటున్నట్లు రాజీనామా లేఖలో వ్రాశారు.

తెలంగాణాలో తెదేపాకు వరుసగా నాలుగు పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయి.

1. రాష్ట్ర విభజన. ఆ కారణంగా చంద్రబాబు నాయుడు ఏపికి షిఫ్ట్ అయిపోవడంతో తెలంగాణాలో తెదేపా బలహీనపడసాగింది.

2. తెదేపా ఎమ్మెల్యేలు తెరాసలో ఫిరాయింపులు. ఆ దెబ్బకు తెదేపా ఇంకా బలహీనపడింది.

3. ఓటుకు నోటు కేసు. ఆ కారణంగా తెదేపా తీవ్ర అప్రదిష్టపాలయింది. దానితో చంద్రబాబు నాయుడు తెలంగాణాలో మునుపటిలా ధైర్యంగా తలెత్తుకొని తిరుగలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన పూర్తిగా ఏపికే పరిమితం అయిపోయారు.

4. ఈ పరిస్థితులలో తెలంగాణాలో తెదేపాకు ఏకైక రక్షకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం, ఆయనతో పాటు పలువురు రాజీనామాలు చేసి కాంగ్రెస్, తెరాసలలో చేరిపోతుండటంతో తెదేపా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

కనుక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టిటిడిపి నేతలతో పార్టీ పరిస్థితి గురించి చర్చించడానికి వస్తున్నారు. అయితే దానిలో కూడా యధాప్రకారం “తెలుగుదేశం పార్టీ నేతలపై కాదు..కార్యకర్తలపై ఆధారపడి నడుస్తోంది కనుక ఎంతమంది నేతలు వెళ్ళిపోయినా పార్టీకి నష్టం లేదు..” అంటూ చిలుకపలుకులు పలికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించితే, తెలంగాణాలో తెదేపాను కాంగ్రెస్, తెరాసలకు అప్పగించేయడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించేసినట్లే భావించవచ్చు. అలాకాక తెరాస లేదా భాజపాతో పొత్తుల గురించి మాట్లాడి తదనుగుణంగా కార్యాచరణ ప్రకటిస్తే, తెలంగాణాలో ఇంకా పార్టీని నడిపించాలని ఉద్దేశ్యం ఉన్నట్లు భావించవచ్చు. 


Related Post