ఇంతకీ అయన ఎవరిని నిందిస్తున్నారు?

October 31, 2017


img

రేవంత్ రెడ్డి తెదేపాను వీడటం వలన తెలంగాణాలో తెదేపా దాదాపు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. కనుక తెదేపా ఆందోళన చెందడం సహజమే. కానీ వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసినప్పుడు, ఆ తరువాత తెదేపా నేతలపై విమర్శలు చేసినప్పుడు చాలా తీవ్రస్థాయిలో స్పందించిన టిటిడిపి సీనియర్ నేతలు అందరూ ఇప్పుడు ఒకపక్క పార్టీ ఖాళీ అయిపోతున్నా మౌనం వహించడం, ప్రేక్షకులు లాగ చూస్తూ ఉండటం చాలా విడ్డూరంగా ఉంది. 

ఇక టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శలు ఆయనను కాక తమ అధినేత చంద్రబాబు నాయుడును తప్పు పడుతున్నట్లున్నాయి. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి అనే దెయ్యం చంద్రబాబు నాయుడుకు దగ్గరై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు గ్రహణంలా పట్టుకొంది. ఇపుడది తొలగిపోయింది,” అని అన్నారు. అంటే రేవంత్ రెడ్డిని చేరదీసి చంద్రబాబు నాయుడు తప్పు చేశారని అంటున్నట్లుంది. 

ఇన్నేళ్ళుగా టిటిడిపి అధ్యక్షుడుగా ఉన్న ఎల్.రమణ ఇటు పార్టీపై కానీ రాష్ట్ర రాజకీయాలపై గానీ తన ప్రభావం ఏమాత్రం చూపలేకపోయారన్నది వాస్తవం. రేవంత్ రెడ్డే తెలంగాణాలో పార్టీకి అధ్యక్షుడన్నట్లు తాను అయన తరువాతే అన్నట్లుగా రేవంత్ రెడ్డి నీడలో గడిపేశారు ఇన్నాళ్ళు. అయితే ఆ కారణంగానే తనకు పార్టీలో గుర్తింపు, గౌరవం లభించలేదని గ్రహించినట్లున్నారు. ఆ దుగ్ధతోనే బహుశః ఆయన రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నట్లున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీలో లేరు కనుక రమణ తన శక్తిసామర్ధ్యాలతో పార్టీని కాపాడుకొని వచ్చే ఎన్నికలలో గెలిపించుకొంటే బహుశః రేవంత్ రెడ్డి కూడా సంతోషిస్తారేమో? 


Related Post