సోనియా దయతో తెలంగాణా వచ్చిందా?

October 30, 2017


img

సోనియా గాంధీ-తెలంగాణా ఏర్పాటు విషయంలో నేటికీ కాంగ్రెస్ నేతలు పరస్పర విరుద్దమైన మాటలు మాట్లాడుతుంటారు. తెలంగాణా ఏర్పాటు ప్రస్తావన వచ్చిన ప్రతీసారి కాంగ్రెస్ నేతలు రెండు విషయాలు చెపుతుంటారు. 1. సోనియా గాంధీ దయ వలననే తెలంగాణా ఏర్పడింది. 2. కేసీఆర్ ఒక్కడివల్లె తెలంగాణా ఏర్పడలేదు..అందరు కలిసిపోరాడితేనే వచ్చింది. వారు చెపుతున్నవి పైపైన చూస్తే నిజమేననిపిస్తుంది. అయితే వాటినే కాస్త లోతుగా చూస్తే వేరే అర్ధం కనబడుతుంది.       

తెలంగాణా కేసీఆర్ ఒక్కడివల్లే రాలేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు కలిసి పోరాడి సాధించుకొన్నామని కాంగ్రెస్ నేతలే చెప్పుకొంటారు. అంటే తెలంగాణా ఏర్పాటు చేయడానికి సోనియా గాంధీ అంగీకరించలేదని, కనుక తాము కూడా ఆమెకు వ్యతిరేకంగా పోరాటాలు చేయవలసి వచ్చిందని వారు అంగీకరిస్తున్నట్లు అర్ధం అవుతోంది. 

మళ్ళీ అంతలోనే ఇచ్చిన మాటకు కట్టుబడి ఆమె తెలంగాణా ఇచ్చారని దాని కోసం ఆమె ఏపిలో తన కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టారని చెపుతుంటారు.  ఒకవేళ ఆమెకు తెలంగాణా ప్రజల సమస్యల పట్ల, వారికి జరుగుతున్న అన్యాయం పట్ల ఏమాత్రం సానుభూతి ఉన్నా, ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకోగలిగి ఉండి ఉంటే ఆమె తెలంగాణా ఏర్పాటుకు 10 ఏళ్ళు సమయం తీసుకొనేవారుకారు కదా? తెలంగాణా ఉద్యమాలు తీవ్రతరం అవడం, అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకురావడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడికలు, తీసివేతలు అన్నీ సరిచూసుకొని, ఏపిలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేవని గ్రహించి, గాలికి ఎగిరిపోయే పేలాలను ‘కృష్ణార్పణం’ అన్నట్లుగా ఎలాగూ ఏపిలో ఓడిపోయే కాంగ్రెస్ పార్టీని పణంగా పెడుతున్నామని నిసిగ్గుగా చెప్పుకొంటూ తెలంగాణాలో అధికారంలోకి రావాలనుకొంది. 

కానీ ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం, టి-కాంగ్రెస్ నేతలు వేసిన తప్పటడుగులు, కేసీఆర్ ప్రదర్శించిన రాజకీయ చతురత, సమయస్పూర్తి కారణంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. తెరాస గెలిచి అధికారంలోకి వచ్చింది. 

కనుక సోనియా గాంధీ తెలంగాణా ప్రజల ఒత్తిడిని భరించలేక, తన పార్టీ రాజకీయ ప్రయోజనాలను కూడా చూసుకొని తెలంగాణా ఏర్పాటు చేశారని అందరికీ తెలుసు. ఒకవేళ 2014లో సార్వత్రిక ఎన్నికలు లేకుంటే సోనియా గాంధీ తెలంగాణా ఇచ్చి ఉండేవారా? అని ఆలోచిస్తే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం అవుతుంది. నిజానికి తెలంగాణా ఏర్పాటు చేసే అధికారం కాంగ్రెస్ అధ్యక్షురాలైన  సోనియా గాంధీకి లేదు..ఉండదని అందరికీ తెలుసు. ఆ అధికారం అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు, ఆయన ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కానీ అయన సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మగా మారిపోవడం వలననే ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి సోనియా గాంధీ అన్నీ తానై సమాంతరంగా ప్రభుత్వం నడిపించారని అందరికీ తెలుసు. అయినా కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీయే తెలంగాణా ఇచ్చేరని నిసిగ్గుగా చెప్పుకొంటుంటారు.  


Related Post