అందరూ శ్రీమంతులు కాలేరు: ప్రకాష్ రాజ్

October 30, 2017


img

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన ‘శ్రీమంతుడు’ సినిమా సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలలో చాలా మందికి స్పూర్తినిచ్చింది. ఆ స్పూర్తితో చాలా మంది అనేక గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. శ్రీమంతుడు సినిమాకు చాలా కాలం క్రితమే నటుడు ప్రకాష్ రాజ్ కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. రెండేళ్ళ క్రితం తెలంగాణాలో రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని షాద్ నగర్ లో కొండారెడ్డిపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. ఆయన తాజా ఇంటర్వ్యూలో ఆ గ్రామం అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయనే విలేఖరి ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం చాలా ఆలోచింపజేసేదిగా ఉంది. 

“మన దగ్గర బోలెడంత డబ్బు ఉందికదాని ఏవో ప్లాన్స్ తయారుచేసేసుకొని రాత్రికి గ్రామాలను అభివృద్ధి చేసేయవచ్చనుకొంటే అంతకంటే పెద్ద పొరపాటు ఉండదని నేను అనుభవపూర్వకంగా తెలుసుకొన్నాను. మనం అనుకొన్న పనులు, అనుకొన్నంత వేగంగా జరుగవు. ఎందుకంటే, గ్రామస్తులు తరతరాలుగా ఎవరో ఒకరి చేతిలో మోసపోతూనే ఉన్నారు. కనుక మన వద్ద ఎంత డబ్బు ఉన్నా ముందుగా వారి అభిమానం, నమ్మకం పొందగలిగితేనే వారి సహకారం లభిస్తుంది. అప్పుడే పనులు చురుకుగా ముందుకు సాగుతాయి. అయినప్పటికీ ఇది రెండుమూడేళ్ళలో పూర్తి చేయగలపని కాదని నాకు భోదపడింది.  గ్రామంలో కొన్ని ఇళ్ళు కట్టించాను. ఒక స్కూలు కట్టించాను. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భూమనపల్లి చెరువు పనులు పూర్తి చేయగలిగాము. నేను ఆ ఊరికి ఇచ్చినదాని కంటే చాలా ఎక్కువే నేర్చుకొన్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఏమి చేశామో ప్రపంచానికి చాటుకోవడం కోసం కాకుండా మన ఆత్మసంతృప్తి కోసమే ఏ పనైనా చేయాలి. గ్రామాలను దత్తత తీసుకోవడం కూడా అంతే. అప్పుడే మన జీవితానికి పరమార్ధం ఏర్పడుతుంది,” అని ప్రకాష్ రాజ్ చెప్పారు. 


Related Post