టిటిడిపి క్యాడర్ ను కాకెత్తుకుపోతోందా?

October 30, 2017


img

రేవంత్ రెడ్డి తెదేపాకు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండటంతో రాష్ట్రంలో తెదేపా క్యాడర్ ను కాకెత్తుకుపోయినట్లుగా కాంగ్రెస్, తెరాసలు ఎవరికీ దొరికినవారిని అవి పంచేసుకొంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి నివాసంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి (తెదేపా) నేతల సమావేశం తరువాత ఆయన తనతో బాటు ఎంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుపోబోతున్నారో స్పష్టం అవవచ్చు. మరోపక్క సందట్లో సడేమియా అన్నట్లుగా తెరాస కూడా తెదేపా కార్యకర్తలకు హడావుడిగా గులాబీ కండువాలు కప్పేస్తోంది. మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన అనేకమంది తెదేపా కార్యకర్తలు ఆదివారం తెలంగాణా భవన్ లో గులాబీ కండువాలు కప్పుకొన్నారు. 

మద్దూరు మండలం కొమ్మూరు ఎంపిటీసీ వెంకటమ్మ, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ సుక్కమ్మ, నందిపాడు సర్పంచ్ ముద్దమ్మ, పెద్రిపాడు ఎంపిటిసి శ్రీనివాస్, ఈరారం ఎంపిటిసి వెంకటమ్మ, మన్నాపూర్ ఎంపిటిసి రాములమ్మ, పెద్రిపాడు మాజీ సర్పంచ్ రాజయ్య, నందిపాడు మాజీ ఉప సర్పంచ్ నెమలి మొగులప్ప, మాజీ ఉప సర్పంచ్ హన్మంతు తదితరులు తెరాసలో చేరారు. 

కేసీఆర్ ను గద్దె దించడానికి రాజకీయ పునరేకీకరణ అవసరం అని చెపుతున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత రాష్ట్రంలో తెదేపా ముఖ్యనేతలు, కార్యకర్తలను, వీలైతే తెరాసలో అసంతృప్తులను కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించేందుకు  రాష్ట్ర పర్యటనకు బయలుదేరాలనుకొంటున్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో ఎట్టిపరిస్థితులలో గెలిచి అధికారంలోకి రావాలనుకోరుకొంటున్న కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని అనుమతించడమే కాకుండా, ఆయనకు సహకరించమని అందరినీ ఆదేశించవచ్చు. 

తెరాస కూడా పార్టీ ఫిరాయింపుల జోరును మరింత పెంచవచ్చు. అప్పుడు రెండు పార్టీలు పోటాపోటీగా తెదేపా నేతలు, కార్యకర్తలను ఎత్తుకుపోవడం మొదలుపెడితే, ఎల్ రమణ, రావూరి, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి వంటివారు పార్టీని ఏవిధంగా కాపాడుకొంటారో...అసలు కాపాడుకోగలరో లేదో చూడాలి.     



Related Post