తెలంగాణాలో 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ...సాధ్యమేనా?

October 30, 2017


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే కనీసం లక్షా యాబైవేలకు పైగా ఖాళీలు ఏర్పడుతాయని, తెరాస అధికారంలోకి వస్తే వాటిని భర్తీ చేస్తుందని 2014 ఎన్నికలలో తెరాస పదేపదే చెప్పింది. కానీ దాదాపు మూడున్నరేళ్ళు పూర్తవుతున్నా ఇంతవరకు వాటిలో సగం ఉద్యోగాలు కూడా భర్తీ కాకపోవడంతో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, నిరుద్యోగ సంఘాలు తరచూ ఆందోళనలు చేస్తున్నాయి. తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈరోజు శాసనసభ సమావేశంలో పలు ఇతర అంశాలతో బాటు దీనిపై కూడా సభలో చర్చ జరపాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని కోరింది. కానీ స్పీకర్ నిరాకరించడంతో కాంగ్రెస్ సభ్యులు వాక్-అవుట్ చేశారు. 

అనంతరం ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఉన్న సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఉద్యోగాల భర్తీ విషయంలో వెనకడుగువేసే ఆలోచనే లేదు. వీలైనంత త్వరలో 1.12 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాము. వాస్తవానికి మేము చెప్పినదాని కంటే మరో 1,000 ఉద్యోగాలు ఎక్కువే ఇస్తాము తప్ప తక్కువ చేయాలనుకోవడం లేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తాము కానీ ఈ సాకుతో మాపై లేనిపోని విమర్శలు చేసే సహించబోము,” అని అన్నారు.

అయితే ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేయడానికి, తరువాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామకాల ప్రక్రియ పూర్తిచేయడానికి టి.ఎస్.పి.ఎస్.సి.కు కనీసం 4-5 నెలలు పడుతోంది. ఈ ప్రక్రియలో లోపాలను ఎత్తిచూపుతూ ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్స్ వేసినట్లయితే ఇంకా ఆలస్యం అవుతుంటుంది. 

ఈనెల 21న మొత్తం 8,792 ఉపాద్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి-ఫిబ్రవరిలోగా నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలని టి.ఎస్.పి.ఎస్.సి.లక్ష్యంగా పెట్టుకొంది. కానీ దానిపై కోర్టులో పిటిషన్ పడింది. కనుక భర్తీ ప్రక్రియ మరికాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది.

ఈవిధంగా ఒక నోటిఫికేషన్ జారీ చేసి దానితో కొన్ని వందలు లేదా వేల ఉద్యోగాలు భర్తీ చేసిన తరువాతే మళ్ళీ మరో నోటిఫికేషన్ ఇవ్వాలనుకొన్నట్లయితే మిగిలిన ఏడాదిన్నర వ్యవధిలో మహా అయితే మరో 3-4 మాత్రమే నోటిఫికేషన్స్ ఇవ్వగలదు. ఇదే లెక్కన భర్తీ చేసే మాటయితే వాటితో మరో 25-32,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే, ప్రతీ 30-45 రోజులకు ఒకటి చొప్పున వరుసగా నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడే సాధ్యం అవుతుంది. మరి తెరాస సర్కార్, టి.ఎస్.పి.ఎస్.సి. అంత వేగంగా చేయగలవా? ఏమో చూద్దాం.             



Related Post