రేవంత్ నిష్క్రమణకు భాజపా కూడా కారణమా?

October 28, 2017


img

తెదేపాకు అనధికార మీడియాగా గుర్తింపు పొందిన ఆంధ్రజ్యోతి మీడియాలో ఈ రోజు ఒక ఆసక్తికరమైన వార్త ప్రచురితమైంది. దానిలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోకుండా ఆపాలని, కోరినట్లు పేర్కొంది. అవసరమైతే తెలంగాణాలో తెదేపా-భాజపాల పొత్తుల గురించి మాట్లాడుకొందామని చెప్పినట్లు పేర్కొంది. కానీ తెలంగాణాలో కొందరు భాజపా నేతలు చేసిన అతికారణంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడని చంద్రబాబు నాయుడు జవాబు చెప్పినట్లు పేర్కొంది. 

తెలంగాణాలో రేవంత్ రెడ్డి మంచి బలమైన నాయకుడనే దానిలో సందేహం లేదు. అటువంటి వ్యక్తి తెదేపాను వీడిపోతే మొదట నష్టపోయేది తెదేపాయే తప్ప భాజపా కాదు. కానీ ఆంధ్రజ్యోతి పేర్కొన్న ప్రకారం చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకోవడం వలన భాజపాకు కూడా అంతే నష్టం అని చెపుతున్నట్లుంది. అది నిజమే కావచ్చు. నిజానికి ఒకానొక సమయంలో రేవంత్ రెడ్డిని భాజపాలోకి రప్పించాలని గట్టి ప్రయత్నాలే జరిగాయి. కానీ కారణాలు ఏవయితేనేమి ఆయన భాజపాలో చేరలేదు. చేరి ఉంటే వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో భాజపా విజయం సాధించలేకపోయినా మరికాస్త బలపడి ఉండేది. కానీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండటంతో ఆ పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది. 

తెలంగాణాలో భాజపా నేతలు అతిగా ప్రవర్తించారన్న చంద్రబాబు సమాధానం ఆసక్తికరంగానే ఉంది. రాష్ట్ర భాజపా నేతలు తెదేపాను దూరంగా పెట్టి, వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరాటం చేస్తామని పదేపదే చెప్పడం వలన తెలంగాణా తెదేపా ఒంటరిదైపోయినట్లయింది. కనుక తెదేపా దాని నేతల రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా కనబడుతోంది. రేవంత్ రెడ్డి నిష్క్రమణకు ఇదీ ఒక కారణం కావచ్చు. పైగా భాజపా తెరాసకు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేసింది. చంద్రబాబు నాయుడు చెప్పిన ఆ ‘అతి’ అదే. కనుక కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డికి వేరే గత్యంతరం కనబడకపోవడంతో ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి ఉండవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లున్నారు. కనుక ఇకనైనా తెలంగాణాలో భాజపా తెదేపా పట్ల తన వైఖరిని స్పష్టం చేయవలసి ఉందని చంద్రబాబు అమిత్ షాకు మెత్తగా సూచిస్తునట్లుంది. 



Related Post