రేవంత్ రాజీనామాకు కారణం అదా?

October 28, 2017


img

సాధారణంగా ఎవరైనా రాజకీయ నాయకుడు పార్టీ వీడి వేరే పార్టీలోకి వెళ్ళే ముందు రాజీనామా లేఖలో పార్టీ అధినేతను, పార్టీ వైఖరిని విమర్శిస్తూ చాలా వ్రాస్తుంటారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి తెదేపాకు గుడ్ బై చెపుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి వ్రాసిన రాజీనామా లేఖలో తాను ఈ స్థాయి చేరుకోవడానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అందించిన సహాయసహకారాలు, కష్టకాలంలో తెదేపాలో అందరూ తనకు ఏవిధంగా అండగా నిలబడింది..అన్నీ గుర్తుచేసుకొని పార్టీతో బంధం తెంచుకొంటున్నందుకు తనకు గుండెను కోసినంత బాధగా ఉందని అన్నారు. 

అయితే తన రాజీనామాకు ఆయన పేర్కొన కారణమే విచిత్రంగా ఉంది. ఎంతో కష్టపడి సాధించుకొన్న తెలంగాణా ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీగా మారి, నిరంకుశ పాలనలో నలిగిపోతోందని, దానిని కేసీఆర్ చేతుల్లో నుంచి కాపాడుకోవలసిన అవసరం ఉందని, అందుకోసం తెలంగాణాలో మళ్ళీ రాజకీయపునరేకీకరణ అవసరమని భావించినందునే పార్టీని వీడిపోతున్నానని, నా నిర్ణయాన్ని సహృదయంతో అర్ధం చేసుకొంటారని ఆశిస్తూ శలవు తీసుకొంటున్నాను,” అని ముగించారు. 

రెండు మూడు రోజులుగా తెదేపాలో చాలా ఉద్రిక్త వాతావరణం కనబడింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి రాజీనామా తరువాత హటాత్తుగా అంత చల్లబడిపోయింది. అసలు ఏమీ జరుగనట్లు తెదేపా నేతలు వ్యవహరించడం విడ్డూరంగానే ఉంది. 

రేవంత్ రెడ్డి పార్టీ నుంచి బయటపడుతూ చాలా హుందాగా వ్యవహరించారు. అలాగే చంద్రబాబు కూడా అంతే హుందా స్పందించారు. పార్టీ తరపున పెద్దిరెడ్డి కూడా రేవంత్ రెడ్డి రాజీనామా గురించి ఇంకా హుందాగా మాట్లాడారు. అంతాబాగానే ఉంది. కానీ కేసీఆర్ ను గద్దె దించడానికే పార్టీని వీడుతున్నానని చెప్పడమే విచిత్రంగా ఉంది. అంటే కేసీఆర్ తో పోరాడటంలో టిటిడిపి విఫలం అయ్యిందని అయన చెప్పకనే చెప్పారు. కానీ తెదేపా అధిష్టానం ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోకుండా రేవంత్ రెడ్డిని సాధరంగా సాగనంపింది.  

ఇక కేసీఆర్ ను గద్దె దించడానికి తెలంగాణాలో రాజకీయపునరేకీకరణ అవసరమని అన్నారు. పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ ఇచ్చిన గౌరవప్రదమైన పేరు అది. రేవంత్ రెడ్డితో పాటు తెదేపా సీనియర్ నేత వేం నరేందర్ రెడ్డి కూడా ఈరోజు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. త్వరలో మరికొంత మంది సీనియర్, జూనియర్ నేతలు కూడా తెదేపాకు గుడ్ బై చెప్పి రేవంత్ వెంట కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి చెపుతున్న రాజకీయ పునరేకీకరణ తెదేపాతోనే మొదలయ్యే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. 



Related Post