రేవంత్ కధకు ముగింపు ఏమిటో?

October 28, 2017


img

రేవంత్ రెడ్డితో సహా టిటిడిపి నేతలందరూ అమరావతిలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయానికి చేరుకొన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్చించేందుకు ఈరోజు చంద్రబాబు వారితో సమావేశం కానున్నారు. ఉదయం 10.30 నుంచి మద్యాహ్నం 12.30 వరకు సమావేశం జరుగుతుంది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతారు. మళ్ళీ భోజన విరామం తరువాత సాయంత్రం 5 గంటల వరకు వారి సమావేశం కొనసాగుతుంది. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న టిటిడిపి నేతలతో హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సమావేశమయినప్పుడు, ఎన్నికలు-పొత్తుల ప్రస్తావన రాగా..వాటికి ఇంకా చాలా సమయం ఉంది కనుక ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడటం సరికాదని, అంతవరకు పార్టీలో అందరు కలిసి పనిచేసుకొంటే మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. అంటే రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించడానికి ఆయన ఇష్టపడటం లేదని స్పష్టం అవుతోంది. 

ఈరోజు అమరావతిలో జరిగే ఈ సమావేశానికి కూడా రేవంత్ రెడ్డి హాజరవుతుండటం గమనిస్తే, ఆయన కూడా తనంతట తానుగా పార్టీని విడిచిపెట్టి వెళ్ళే ఉద్దేశ్యం లేదని, బహిష్కరణ వేటు పడితేనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తునట్లుంది. 

అయితే రేవంత్ రెడ్డి-ఏపి, టిటిడిపి నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకొన్న కారణంగా వారి మధ్య తీవ్రమైన విభేదాలు నెలకొని ఉన్నాయని స్పష్టం అవుతోంది. ఈ పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఇంకా తెదేపాలో కొనసాగగలరా? ఒకవేళ కొనసాగదలచినా మిగిలినవారు అందుకు అంగీకరిస్తారా? ఆయనకు సహకరిస్తారా? అంటే అనుమానమే. కనుక ఈరోజు సమావేశంలో రేవంత్ రెడ్డి కధకు చంద్రబాబు నాయుడు ఎటువంటి ముగింపు ఇస్తారో చూడాలి. 


Related Post