పొమ్మనలేక పొగబెడుతున్న ట్రంప్ సర్కార్!

October 28, 2017


img

అమెరికాలో నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను గుర్తించడంలో ఒబామా సర్కార్ విఫలమైనప్పటికీ, వ్యాపారస్తుడైన డోనాల్డ్ ట్రంప్ దాని తీవ్రతను, దాని విపరీత పరిణామాలను సరిగ్గానే గుర్తించగలగారు. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఆయన దానినే ఆయుధంగా చేసుకొని విజయం సాధించారు. తాను అధ్యక్షుడైతే ‘అమెరికా ఫస్ట్' (అన్ని రంగాలలో అమెరికన్లకే తొలి ప్రాధాన్యత) విధానాన్ని అమలుచేస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే తన విధానాలను నిర్మొహమాటంగా అమలుచేయడం మొదలుపెట్టారు. దానికి ఎంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా ఖాతరు చేయడం లేదు.

ఆ ప్రయత్నంలో భాగంగానే హెచ్1-బి వీసాలను కట్టడి చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే వాటిని పొందేందుకు చాలా కటినమైన ఆంక్షలు విధించారు. వాటిని ఇంకా కటినతరం చేయడానికి ట్రంప్ సర్కార్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం ఇక నుంచి హెచ్1-బి వీసాలను రెన్యూవల్ చేయించుకోవడం మరింత కష్టంగా మారబోతోంది. ప్రతీసారి అభ్యర్ధులు తమ పూర్తి వివరాలను, తాము అమెరికాలో ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమిటి..రెన్యువల్ ఎందుకు కోరుతున్నారు? వంటి అధికారుల ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. అంతే కాదు...తాము అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచి అప్పటి వరకు చేసిన ఉద్యోగ వివరాలు, ఉద్యోగ మార్పుల వివరాలు, కారణాలు, విద్యార్హతలు, కుటుంబ వివరాలు వంటి అనేక ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పుకోవలసి ఉంటుంది. అంటే హెచ్1-బి వీసాల రెన్యువల్ చేయడానికి నిరాకరించే అవకాశాలు రెట్టింపు అయ్యాయన్నమాట. మరోవిధంగా చెప్పాలంటే ట్రంప్ సర్కార్ భారతీయులతో సహా విదేశీయులు అందరినీ అమెరికా నుంచి పొమ్మనకుండా పొగ బెడుతోందని చెప్పవచ్చు. హెచ్1-బి వీసాలపై   ఇప్పటికే విధించిన అనేక ఆంక్షల కారణంగా వేలాది భారతీయులు అమెరికా ఉద్యోగాలు దూరం అవుతున్నాయి. తాజా ఆంక్షలతో డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి. 

అయితే మన దేశంలో, మన రాష్ట్రంలో ఉద్యోగాలు మనవాళ్లకే దక్కాలని మనం ఏవిధంగా కోరుకొంటామో, ట్రంప్ కూడా అదేవిధంగా కోరుకొంటున్నారు కనుక ఈ విషయంలో ట్రంప్ సర్కార్ ను తప్పు పట్టడం సరికాదు. అయితే ఈ ఆంక్షలను దశలవారిగా అమలుచేసి ఉండి ఉంటే బాగుండేదని అందరి అభిప్రాయం. ఈ పరిణామాలు మనకు చాలా నష్టం కలిగిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ, గత 70 ఏళ్ళుగా స్వావలంభన సాధించే ప్రయత్నాలు చేయకుండా పరాయిదేశంపై ఆధారపడటం అలవాటు చేసుకోన్నాము. దాని వలన ఏమవుతుందో ట్రంప్ సర్కార్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తోందిపుడు. కనుక ఇకనైనా భారత్ సర్కార్, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు, భారతీయులు కూడా మన కాళ్ళ మీద మనం నిలబడే ప్రయత్నాలు మొదలుపెడితే మనం అమెరికా దయాదాక్షిణ్యాలపై ఆధారపడనవసరం ఉండదు.  


Related Post