రేవంత్ రెడ్డి తొందరపడ్డారా?

October 27, 2017


img

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలవడం, తిరిగి వచ్చి ఏపి, తెలంగాణా తెదేపా నేతలతో గొడవలుపడటం అంతా నాటకీయంగా ఉన్నట్లు కనిపిస్తే తప్పు కాదు. పార్టీలో తానొక్కడినే కేసీఆర్ తో గట్టిగా పోరాడుతున్నానని, మిగిలినవారిలో చాలామంది ఆయనతో టచ్ లోనే ఉంటున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. అది నిజమో కాదో తెలియదు కానీ టిటిడిపిలో రేవంత్ రెడ్డి తప్ప మరెవరూ తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా బహిరంగంగా..ధైర్యంగా మాట్లాడిన దాఖలాలు లేవు. 

తెలంగాణాలో తెదేపాను కాపాడుకొంటూనే మరోపక్క తానొక్కడినే కేసీఆర్ తో ఒంటరిపోరాటం చేస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పుకొన్నారు. అది నిజమే కావచ్చు. కానీ పార్టీని కాపాడుకోవాలని ఆయన అంతగా తాపత్రయపడుతున్నప్పుడు, హటాత్తుగా డిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చినప్పుడు వాటిని గట్టిగా ఖండించి ఉండాలి. కానీ ఆయన ఆ రెండూ చేయలేదు. పైగా ఏపి, తెలంగాణా రాష్ట్రాలలోని తన సహచర తెదేపా నేతలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం ద్వారా మరొకసారి గీత దాటారు. ఆయనకు టిటిడిపిని కాపాడుకోవాలనే శ్రద్ధ, తపన ఉన్నట్లయితే డిల్లీ వెళ్ళేబదులు అమరావతి వెళ్లి చంద్రబాబు నాయుడుని కలిసి మాట్లాడితే, ఇప్పుడు పరిస్థితులు వేరేవిధంగా ఉండేవి. కానీ అయన తొందరపాటుతోనో లేక ఉద్దేశ్యపూర్వకంగానో వరుసగా తప్పటడుగులు వేశారు. 

ఇప్పటికైనా ఆయన తెదేపాకు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని దృడంగా నిశ్చయించుకొన్నట్లయితే తదనుగుణంగా అడుగులు వేస్తే, ఈ పొరపాట్లన్నీ వ్యూహాత్మకమైన చర్యలుగా పరిగణింపబడతాయి. కానీ ఈరోజు అయన పార్టీలో తాను వ్యతిరేకిస్తున్నవారితో లేదా తనను వ్యతిరేకిస్తున్న మిగిలిన నేతలతో కలిసి తమ అధినేత చంద్రబాబు నాయుడును కలిసారు. మళ్ళీ రేపు అమరావతిలో మరోమారు కలువబోతున్నారు. తద్వారా రేవంత్ రెడ్డి తాను సందిగ్ధంలో ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. కనుక చంద్రబాబు నాయుడు ఏమి నిర్ణయం తీసుకొంటారని ఆలోచించేబదులు తాను ఏమి చేయాలనుకొంటున్నారో ముందు ఆలోచించుకొని తదనుగుణంగా నడిస్తే మంచిది. 

ఇది చదివారా? మహేష్ మూవీ టైటిల్ అది కాదా..!


Related Post