శుక్రవారం నుంచి తెలంగాణా రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు మొదలవబోతున్నాయి. తెరాస సర్కార్ రైతు వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ టి-కాంగ్రెస్ మొదటిరోజునే ‘ఛలో అసెంబ్లీ’ పేరుతో అసెంబ్లీ ముట్టడిచేయబోతున్నట్లు ప్రకటించింది.
రైతు సమస్యల గురించి తమ ప్రభుత్వాన్ని నిలదీయదలిస్తే సమావేశాలకు హాజరయ్యి నిలదీయాలి కానీ సభకు రాకుండా రోడ్లపై కూర్చొని ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా? అని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలు మొదలైనప్పుడు వాటిని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయాలి గానీ వాటి నుంచి ఈవిధంగా తప్పించుకొని పారిపోవడం ఎందుకని నిలదీశారు. ఆయన ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు ఇంకా సమాధానం చెప్పవలసి ఉంది.
ఇక్కడ తెలంగాణాలో కాంగ్రెస్ చేస్తున్న పనే అక్కడ ఏపిలో వైకాపా కూడా చేస్తుండటం విశేషం. ఈరోజు లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపి వైకాపా లెజిస్లేటివ్ సమావేశంలో ‘తెదేపాలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటువేసే వరకు శాసనసభ, మండలి సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించామని’ ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
శాసనసభ, మండలి సమావేశాలలో తాము లేవనెత్తుతున్న ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని తిట్టేందుకే తెదేపా సర్కార్ ఈ సమావేశాలను నిర్వహిస్తోందని అన్నారు. తెదేపాలో చేరిన మొత్తం 20 మంది వైకాపా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వరకు తాము సమావేశాలకు హాజరుకాదలచుకోలేదని స్పష్టం చేశారు.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యల పేరు చెప్పి తప్పించుకొంటుంటే, అక్కడ వైకాపా ఇటువంటి కుంటిసాకుతో శాసనసభ సమావేశాలకు హాజరవకుండా తప్పించుకొంటోంది. అయితే తెలంగాణాలో కాంగ్రెస్సా పార్టీ ఒక్కరోజు మాత్రమే తప్పించుకొంటే, ఏపిలో వైకాపా నిరవధికంగా తప్పించుకొంటోంది.
సాధారణంగా శాసనసభ సమావేశాలంటే అధికార పార్టీలకు గుబులు పడుతుంటాయి. కానీ అందుకు విరుద్దంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు భయపడుతుండటం విశేషం. శాసనసభ, మండలి సమావేశాలలో ఏదైనా కారణం చేత ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేస్తే అధికార పార్టీని దుమ్మెత్తిపోసే ప్రతిపక్షాలు మరి ఇప్పుడు ఎందుకు హాజరుకాకుండా పారిపోతున్నాయో? ఏవో ఒక కుంటిసాకులు చెప్పి శాసనసభ సమావేశాలకు హాజరుకాదలచుకోనప్పుడు మరి ఎన్నికలలో పోటీ చేయడం దేనికి?