దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైకాపానేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. దానిలో తాను ఏమి చూపించబోతున్నాడో వర్మ దాపరికం లేకుండా నిర్భయంగా ప్రకటించేశాడు. ఆ సినిమా షూటింగ్ 2018 మార్చిలో మొదలుపెడుతున్నందున, అది పూర్తయ్యేసరికి ఆగస్ట్ అవుతుంది కనుక దానిని సెప్టెంబర్ లో విడుదల చేస్తున్నాను తప్ప రాజకీయ దురుదేశ్యంతో ఎన్నికలకు ముందు విడుదల చేస్తున్నట్లు బావించరాదని వర్మ చెప్పాడు.
అయితే ఆ సినిమా వలన తెదేపాకు ఎంతో కొంత నష్టం జరిగే ప్రమాదం ఉంది కనుక తెదేపా ఆందోళన చెందడం సహజమే. అందుకే తెదేపా నేతలు ఆ సినిమాపై పరోక్షంగా అభ్యంతరాలు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి అభ్యంతరాలను, అనుమాలను తాను పట్టించుకోనని ఆ సినిమాను తప్పకుండా తీస్తానని వర్మ స్పష్టం చేశాడు.
ఆ సినిమాకు తన పేరు జోడించి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని పేరు పెట్టినప్పటికీ లక్ష్మీ పార్వతి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కనుక ఆ సినిమా వెనుక ఆమె హస్తం కూడా ఉందనే అనుమానం తెదేపా నేతలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తెదేపాను రాజకీయంగా దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతో వైకాపా రామ్ గోపాల్ వర్మ, లక్ష్మీ పార్వతిని అడ్డుపెట్టుకొని ఈ సినిమా తీస్తోందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెదేపా నేతలు ఆ సినిమాపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే లక్ష్మీ పార్వతి లోలోన సంతోషిస్తూ, పైకి మాత్రం ‘ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎవరు సినిమాగా తీసినా సమర్దిస్తాను’ అంటూ చెప్పసాగారు. అప్పుడు తెదేపా నేతలకు ఏవిధంగా ఉంటుందో తేలికగానే ఊహించవచ్చు.
అయితే ఇక్కడే చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా, తన రాజకీయ చతురత ప్రదర్శించారు. ‘ఎన్టీఆర్ జీవితం గురించి ప్రజలందరికీ తెలుసు కనుక దానిని ఎవరు వక్రీకరించాలని ప్రయత్నించినా ప్రజలు క్షమించరని, కనుక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విషయంలో పార్టీ నేతలు ఎవరూ అనవసరంగా స్పందించవద్దని ఆదేశించారు. ఆయన అభిప్రాయాన్ని వర్మ కూడా స్వాగతించాడు. అయితే వర్మ, లక్ష్మీ పార్వతి, వైకాపా ఎవరూ ఊహించలేని పెద్ద షాక్ ఈరోజు ఆయన మరొకరి ద్వారా ఇప్పించారు.
ప్రముఖ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి (తెదేపా అభిమాని) తాను కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు ఈరోజు ప్రకటించారు. దానికి ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ అనే టైటిల్ ‘ఆదర్శ గృహిణి’ అనే సబ్-టైటిల్ పెట్టి దాని ఫస్ట్-లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
దానిలో ఒక మహిళ (బహుశః లక్ష్మీ పార్వతి పాత్ర) నడుము వరకు వీపు భాగం మొత్తం కనిపించే విధంగా నిలబడి ఉన్న ఒక ఫోటో ఉంది. ఆ పేరులో ‘గ్రంధం’ అని ‘ఆదర్శ గృహిణి’ అని ఎందుకు పెట్టారో తేలికగానే ఊహించుకోవచ్చు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ను వివాహం చేసుకోకముందు హరికథలు చెప్పుకొనే గందం సుబ్బారావు అనే ఒక కళాకారుడి భార్య అని అందరికీ తెలిసిందే. కనుక ఈ సినిమాతో లక్ష్మీ పార్వతి గత చరిత్రను త్రవ్వి తీయబోతున్నారని స్పష్టం అవుతోంది. పైగా ఫస్ట్-లుక్ పోస్టర్ చూస్తే దానిలో లక్ష్మీ పార్వతిని ఏవిధంగా చూపించబోతున్నారో అర్ధమవుతుంది.
ఈ సినిమా ప్రకటన చూసి లక్ష్మీ పార్వతి సహజంగానే షాక్ అయ్యారు. ఈరోజు ఉదయం ఆమె హడావుడిగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లోని ఎన్టీఆర్ సమాధి వద్ద మౌనదీక్షకు కూర్చొని నిరసన తెలిపారు. తన అనుమతి లేకుండా ఎవరూ తన జీవిత చరిత్రపై సినిమా తీయడానికి వీలులేదని, తీస్తే తప్పకుండ అడ్డుకొంటానని చెప్పారు.
వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీస్తానాన్నపుడు అభ్యంతరం చెప్పని ఆమె ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెపుతున్నారని తెదేపా నేతలు ప్రశ్నించడం ఖాయం. అలాగే ఎన్టీఆర్ పై ఎవరైనా సినిమాలు తీయవచ్చని చెప్పిన ఆమె ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెపుతోందని ప్రశ్నించకమానరు.
ఆమె స్పందనపై కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి స్పందిస్తూ, ఈ సినిమాను తప్పకుండా తీస్తానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలో సినిమాలు, రాజకీయాల గురించి తేజ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో చూపిస్తారని, ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత భాగాన్ని వర్మ తీస్తున్నాడని, అయితే మద్యలో ఆమెకు ఎన్టీఆర్ తో ఏవిధంగా పరిచయం ఏర్పడింది..అది ఏవిధంగా ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసిందనే విషయాలను రెండు సినిమాలలో చూపబోవడం లేదు కనుకనే తాను ఆ చిన్న భాగాన్ని సినిమాగా తీస్తున్నానని చెప్పారు. ఇది ఎన్టీఆర్ పై అభిమానంతో, భక్తితో ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా చూపించాలనే ఆలోచనతోనే తీస్తున్నాను తప్ప దీనితో ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.
ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రకు (తెదేపాలో చేరాలనుకొంటున్న) ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్ తీసుకోవాలనుకొంటున్నట్లు చెప్పారు. ఒకవేళ ఆమె అంగీకరించకపోతే రాయ్ లక్ష్మీ పేరును పరిశీలిస్తామని చెప్పారు.
కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాను సిరిపురపు విజయ భాస్కర్ రెడ్డి సమర్పణలో నాగహృషీ ఫిలింస్ బ్యానర్ పై జి. విజయ కుమార్ గౌడ్ నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ముల్లును ముల్లుతో తీయడం అంటే బహుశః ఇదేనేమో?