టిటిడిపి మ్యాచ్..నేడే ఫైనల్స్?

October 26, 2017


img

టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కారణంగా పార్టీలో తలెత్తిన సంక్షోభానికి ఈరోజు ముగింపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఈరోజు నిర్వహించదలచిన తెదేపా లెజిస్లేటివ్ సమావేశాన్ని రద్దు చేసుకొన్నట్లు తాజా సమాచారం. 

కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణాలో పార్టీకి చాలా నష్టం కలిగిస్తున్నందున, ఆయనను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ చంద్రబాబు నాయుడుకు లేఖ వ్రాశారు. కనుక ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

అయితే రేవంత్ రెడ్డిపై తుది నిర్ణయం తీసుకొనే ముందు ఒకసారి రేవంత్ రెడ్డితో మాట్లాడుతారా లేక పార్టీ నేతల కోరిక మేరకు పార్టీ నుంచి బహిష్కరిస్తారా అనే విషయం ఈరోజు తేలిపోవచ్చు.  

చంద్రబాబు నాయుడు అనుమతితో టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ నేతృత్వంలో పార్టీ నేతలు ఈరోజు గోల్కొండ హోటల్ లో రాష్ట్ర భాజపా నేతలతో సమావేశం కాబోతున్నారు. అయితే పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని ముందు పరిష్కరించుకోకుండా తెదేపాతో పొత్తులకు అయిష్టత చూపుతున్న భాజపా నేతలతో తెదేపా నేతలు సమావేశం కాబోతుండటం చాలా విచిత్రంగా ఉంది. 

పొత్తులు వేరు..పోరాటాలు వేరు..భాజపాతో కలిసి తెరాస సర్కార్ పై పోరాటాలను ఏవిధంగా కొనసాగించాలనే విషయంపై చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో తెదేపా-భాజపా-తెరాసలు చేతులు కలిపితే అందరికీ ప్రయోజనం ఉంటుందని తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సూచించిన తరువాతే హటాత్తుగా ఈ సమావేశం జరుగుతోంది కనుక బహుశః ఆ దిశలో ఇది మొదటి అడుగుగా భావించాలేమో? 


Related Post