మేము రెడీ..రాష్ట్రాలు రెడీనా? జైట్లీ

October 25, 2017


img

వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలపై సర్వత్రా వినిపిస్తున్న విమర్శలపై కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ కంటి తుడుపు చర్యగా 2 శాతం సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్  తగ్గించింది. రాష్ట్రాలను కూడా కనీసం 5 శాతం వ్యాట్ పన్ను తగ్గించమని కోరింది. భాజపా పాలిత రాష్ట్రాలు మాత్రమే 1-2 శాతం తగ్గించాయి తప్ప మిగిలిన రాష్ట్రాలు పన్ను తగ్గించకపోవడంతో డీజిల్, పెట్రోల్ ధరలు ఎప్పటిలాగే సామాన్యుడికి గుదిబండగా ఉన్నాయి. 

దేశంలో దాదాపు అన్ని ఉత్పత్తులు, సేవలను జి.ఎస్.టి. పరిధిలోకి తెచ్చి డీజిల్, పెట్రోల్ ధరలను ఎందుకు తేలేదనే ప్రశ్న తరచూ వినబడుతూనే ఉంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ దానికి సమాధానంగా, “ఆ రెండింటినీ కూడా జి.ఎస్.టి. పరిదిలోకి తేవడానికి మేము సిద్దమే కానీ అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకరించాల్సి ఉంటుంది,” అని అన్నారు.

జి.ఎస్.టి. అమలులోకి వచ్చిన తరువాత అన్ని రాష్ట్రాలు స్థానిక పన్నుల రూపేణా వచ్చే ఆదాయాన్ని కోల్పోయాయి. అందుకు బదులుగా కేంద్రప్రభుత్వం వాటికి ఇవ్వవలసిన నష్టపరిహారం, జి.ఎస్.టి.లో వాటికి రావలసిన వాటా సొమ్మును చెల్లించడంలో జాప్యం జరుగుతోందని చాలా రాష్ట్రాలు పిర్యాదు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అవి డీజిల్, పెట్రోల్ పై వచ్చే ఆదాయాన్ని కూడా ఏవిధంగా వదులుకోగలవు? వదులుకొంటే వాటి మనుగడ సాగేదెలా? అప్పు కేంద్రప్రభుత్వం విదిలించే నిధులపైనే ఆధారపడవలసి వస్తుంది. అందుకే అవి డీజిల్, పెట్రోల్ ను జి.ఎస్.టి.లోకి తేవడానికి అంగీకరించడం లేదు. ఈ సంగతి కేంద్ర ఆర్ధికమంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీకి కూడా తెలుసు. కానీ రాష్ట్రాలదే తప్పు అన్నట్లు మాట్లాడారు. వాటిని జి.ఎస్.టి.లో పరిధిలోకి తీసుకువాలని కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా భాజపా పాలిత రాష్ట్రాలన్నిటిలో దానిని అమలుచేయవచ్చు కదా? అక్కడ అమలుచేయమని హుకుం జారీ చేస్తే ఎవరు కాదంటారు? కానీ ఆవిధంగా చేయడం లేదంటే చిత్తశుద్ధి లేదని స్పష్టం అవుతోంది. డీజిల్, పెట్రోల్ ఉత్పత్తులను జి.ఎస్.టి. క్రిందకు తీసుకురాదలిస్తే ముందుగా రాష్ట్రాల ఆర్ధికపరిస్థితిలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. అప్పుడే ఇది అమలుచేయడం సాధ్యం అవుతుంది. కానీ కేంద్రానికి అంత శ్రద్ధ ఉందా..ఏమో?    



Related Post