తమిళ సినీనటుడు విజయ్ నటించిన ‘మెర్సల్’ తమిళ సినిమాలో నోట్ల రద్దు, జి.ఎస్.టి.అంశాలపై చేసిన విమర్శలను అతని సహనటుడు విశాల్ మద్దతు ప్రకటించిన మరునాడే అతని ఇంటిపై ఐటి అధికారులు దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వినబడుతున్నప్పటికీ, ఐటిశాఖ మాత్రం ఆ సినిమా వివాదంతో ఈ కేసుకు ఎటువంటి సంబందమూ లేదని, తమ దర్యాప్తులో నటుడు విశాల్ రూ.51 లక్షల పన్ను చెల్లించకుండా ఎగవేసినట్లు గుర్తించామని వాదిస్తూ ఈరోజు అతనికి నోటీసులు పంపించారు. ఈ శుక్రవారం చెన్నై, వడపళని ప్రాంతంలో గల తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావలసిందిగా నోటీసులో కోరారు.
దీనిపై విశాల్ స్పందిస్తూ, “నేను చాలా టంచన్ గా ఆదాయపన్ను చెల్లిస్తుంటాను. ఆ విషయం వారికి కూడా తెలుసు. అయినా నేను పన్ను ఎగవేశానని ఆరోపిస్తూ నోటీసు పంపారు. నేను తప్పకుండా విచారణకు హాజరయ్యి సంబంధిత ఆధారాలన్నీ సమర్పిస్తాను. అయినా నాపై కక్ష సాధింపు చర్యలకు పూనుకొంటే, ఏవిధంగా స్పందించాలో నాకు బాగా తెలుసు,” అని చెప్పారు.
తమిళనాడులో రాజకీయాలకు, సినిమాలకు మద్యన చాలా సన్నటి గీత ఉంటుంది. కనుక మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ సినీ హీరోల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై, ప్రజలపై చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక వారితో ఏ వ్యవహారమైనా చాలా సున్నితంగా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. కాదని మొరటుగా లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తే బెడిసికొడుతుందని గతంలో చాలాసార్లు నిరూపితమైంది. ఎప్పటికైనా తమిళనాడులో అడుగుపెట్టాలని కలలుగంటున్న బిజెపి మరింత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది.