అసెంబ్లీ రావడానికి కాంగ్రెస్ భయపడుతోందా?

October 25, 2017


img

ఈ శుక్రవారం నుంచి తెలంగాణా శాసనసభ, మండలి సమావేశాలు మొదలవుతాయి. అసెంబ్లీ సమావేశాలు మొదటిరోజునే ‘ఛలో అసెంబ్లీ’ పేరిట శాసనసభ, మండలిని ముట్టడించాలనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదనకు టి-కాంగ్రెస్ అంగీకరించడంతో, ఇప్పుడు బంతి తెరాస సర్కార్ కోర్టులో పడింది.  

టి-కాంగ్రెస్ నిర్ణయంపై రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ టి-కాంగ్రెస్ నేతలపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. “టి-కాంగ్రెస్ నేతల దగ్గర సభలో మాట్లాడేందుకు సబ్జెక్ట్ లేదు..సత్తా లేదు..అందుకే మొదటిరోజునే శాసనసభ ముట్టడి కార్యక్రమం పెట్టుకొన్నారు. వారడిగే ప్రతీ ప్రశ్నకు మేము సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నప్పుడు, వారు ధైర్యంగా వచ్చి శాసనసభ, మండలిలో మాతో మాట్లాడాలి. మేము వారికి సంధానాలు చెప్పకుండా తప్పించుకొని పారిపోయినట్లయితే ఇటువంటి పనులు చేసినా అర్ధం ఉంటుంది కానీ సమావేశాలు మొదటిరోజే ఈవిధంగా చేయడానికి అర్ధం ఏమిటి? కాంగ్రెస్ నేతల దయనీయమైన పరిస్థితి చూస్తుంటే నాకు వారి మీద జాలి వేస్తోంది. ఇప్పటికైనా వారు పునరాలోచించుకొని సమావేశాలకు హాజరుకావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సీనియర్ రాజకీయ నాయకుడైన జానారెడ్డిగారు కూడా ఈవిధంగా చేయడం బాగాలేదు. అయన కాంగ్రెస్ పక్ష నేత కనుక తమ పార్టీ వారిని ఒప్పించి సమావేశాలకు హాజరయ్యి తమ గౌరవం నిలబెట్టుకోవాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.

“సమస్యలపై చర్చించడానికి ఉభయసభలను ఎన్ని రోజులు కావాలనుకొంటే అన్ని రోజులు నిర్వహిస్తున్నాము. అనేకసార్లు రాత్రి 10-11 గంటల వరకు కూడా చర్చించాము. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రతీ సమస్యపై సభలో లోతుగా చర్చిస్తున్నాము. అలాగే ప్రతీ ప్రశ్నకు పూర్తి వివరాలతో సహా సమాధానాలు ఇస్తున్నాము. మన సభ జరుగుతున్న తీరు చూసి ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా మెచ్చుకొంటున్నాయి. మన సమావేశాలు చాలా హుందాగా, అర్ధవంతంగా సాగుతున్నాయని పొరుగు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు మెచ్చుకొంటున్నారు. మీరడిగే ప్రతీ ప్రశ్నకు మేము సమాధానం చెపుతామన్నప్పుడు మీరు శాసనసభకు రాకుండా ఈవిధంగా రోడ్ల బైటాయించడం దేనికి? మీరు శాసనసభకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి కాంగ్రెస్ నేతలదే భాద్యతవుతుందాని మరిచిపోవద్దు. ఇప్పటికైనా మీ భయాలను, అహాన్ని, అనుమానాలను పక్కన పెట్టి శాసనసభ, మండలి సమావేశాలకు హాజరుకావాలని కోరుతున్నాను లేకుంటే ప్రజలలో మీరే నవ్వులపాలవడం ఖాయం,” అని హరీష్ రావు అన్నారు. 


Related Post