టిటిడిపిలో రేవంత్ రెడ్డి కారణంగా తలెత్తిన సంక్షోభం పతాకస్థాయికి చేరింది. రేపు రేవంత్ రెడ్డి శాసనసభలో లెజిస్లేటివ్ సమావేశం నిర్వహించడానికి సిద్దం అవుతుంటే, టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ సరిగ్గా అదే సమయంలో తెదేపా-భాజపా నేతల సమావేశం నిర్వహించబోతున్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని, ఈలోగా టిటిడిపిని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని, ఆయన వలన పార్టీకి చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది కనుక తక్షణం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ ఎల్ రమణ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ వ్రాసారు. పార్టీ నేతల మద్య చిచ్చు పెట్టడానికే ఆయన రేపు లెజిస్లేటివ్ సమావేశం నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నానని ఎల్ రమణ అన్నారు.
తనను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ ఎల్ రమణ లేఖ వ్రాయడాన్ని రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఉన్న తనను పార్టీలో నుంచి బహిష్కరించాలనే అధికారం రామనకు లేదని అన్నారు. ఆ హోదాలోనే రేపు తాను లెజిస్లేటివ్ సమావేశం నిర్వహించబోతున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిశ్చయించుకొన్నప్పుడు మళ్ళీ ఈవిధంగా వ్యవహరించడం సరికాదనే చెప్పాలి. అయితే తనంతట తాను పార్టీ వీడివెళ్ళిపోయినట్లయితే, పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయాడని తెలంగాణా తెదేపా నేతలు నిందించవచ్చు కనుక పార్టీ చేత బహిష్కరణ వేటు వేయించుకొని బయటపడాలనుకొంటున్నారేమో? ఏమైనప్పటికీ ఇంతకాలం తెలంగాణాలో పార్టీకి ప్రాతినిధ్యం వహించి బయటకు వెళ్ళిపోతూ రేవంత్ రెడ్డి ఈవిధంగా వ్యవహరించడం సబబుగా లేదనే చెప్పాలి.