బిజెపి మెర్సల్ కొరివితో తల గోక్కొంటోందా?

October 24, 2017


img

ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలపై పట్టు సాధించిన బిజెపి దక్షిణాది రాష్ట్రాలపై కూడా పట్టు సాధించాలని చాలా తాపత్రయపడుతోంది కానీ దాని ప్రయత్నాలు ఫలించడం లేదు. ముఖ్యంగా జయలలిత ఆకస్మిక మరణం తరువాత తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడటంతో ఆ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి ఇదే గొప్ప అవకాశంగా బిజెపి భావించింది. కానీ దాని వ్యూహాలు ఏవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. 

కనుక ఏవిధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్న బిజెపికి ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ హీరోగా నటించిన ‘మెర్సల్’ సినిమా ఒక గొప్ప అవకాశంగా కనిపించినట్లుంది. ఆ సినిమాలో నోట్ల రద్దు, జి.ఎస్.టి.పై కొన్ని వివాదాస్పదమైన డైలాగులు ఉన్నాయనే సాకుతో రాష్ట్ర బిజెపి చాలా హడావుడి చేయడం మొదలుపెట్టింది. 

తద్వారా బిజెపి ప్రజల దృష్టిని ఆకర్షించగలిగింది కానీ ప్రజల, సినీ పరిశ్రమ ఆగ్రహానికి గురికావలసివచ్చింది. కమల్ హాసన్, రజనీకాంత్, విశాల్ వంటి కోలీవుడ్ నటులు అందరూ మెర్సల్ సినిమాకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆ సినిమాలో నోట్ల రద్దు, జి.ఎస్.టి. అంశాలపై ఉన్న డైలాగులు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నందున ప్రజలు కూడా వాటితో ఏకీభవిస్తున్నారు. అయితే ప్రజాభిప్రాయాన్ని గమనించకుండా రాష్ట్ర బిజెపి నేతలు తమ ఉనికిని చాటుకోవడానికి ఏదో ఒక అవకాశం దొరికిందని హడావుడి చేస్తూ ప్రజాగ్రహానికి గురవుతున్నారు. 

కాంగ్రెస్, బిజెపిలు జాతీయ పార్టీలు అయినప్పటికీ తమిళనాడులో సినీ ప్రముఖులు, ప్రాంతీయ పార్టీల మద్దతు లేనిదే అడుగుపెట్టలేవు. అడుగుపెట్టినా ప్రజలు వాటిని ఆదరించారని అనేకసార్లు నిరూపితం అయ్యింది. ఇప్పుడు ‘మెర్సల్’ చిత్రంపై అనవసరపు హడావుడి చేస్తున్న బిజెపికి కూడా ఈ సంగతి బాగా తెలుసు. అయినా అది అనాలోచితంగా చేస్తున్న ఈ హడావుడి వలన తమిళ ప్రజలను...వారిని చాలా తీవ్రంగా ప్రభావితం చేయగల సినీ ప్రముఖులను కవ్వించినట్లవుతోంది. తమిళనాడులో అడుగుపెట్టాలని తహతహలాడుతున్న బిజెపి అందుకు విరుద్ధంగా ‘మెర్సల్ కొరివి’తో తల గోక్కొంటోందనిపిస్తోంది. 

ఆ సినిమా తెలుగులో ‘అదిరింది’ అనే పేరుతో త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా విడుదల కాబోతోంది. తెలంగాణా, ఏపి రాష్ట్రాలలో కూడా బిజెపి పరిస్థితి అంత గొప్పగా లేదు కనుక ఇక్కడ కూడా బిజెపి హడావుడి చేస్తుందేమో? ఒకవేళ దానికి ఆ ఉద్దేశ్యం లేకపోయినా తమిళనాడులో ఆ సినిమాను వ్యతిరేకిస్తున్నప్పుడు తెలుగు రాష్ట్రాలలో మౌనం వహించలేదు కనుక హడావుడి చేయక తప్పదేమో?


Related Post