ఆ విషయంలో కూడా ఇంత అయోమయమా?

October 24, 2017


img

గతేడాది నవంబర్ 30న జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం థియేటర్లలో సినిమా మొదలయ్యే ముందు విధిగా జనగణమన జాతీయగీతం ప్రదర్శించాలని, ఆ సమయంలో ధియేటర్లో ఉన్న ప్రేక్షకులు అందరూ విధిగా లేచి నిలబడాలని ఆదేశించింది. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు..అదే న్యాయమూర్తి జనగణమన గీతం ప్రదర్శితమవుతున్నప్పుడు ధియేటర్లో ఉన్న ప్రేక్షకులు అందరూ విధిగా లేచి నిలబడనవసరం లేదని చెప్పడం విశేషం. 

గత ఏడాది ఈ కేసుపై విచారించినప్పుడు జాతీయగీతం ప్రదర్శిస్తున్నప్పుడు ప్రేక్షకులు అందరూ నిలబడటం ద్వారా మనల్ని మనమే గౌరవించుకొన్నట్లే అవుతుంది కనుక దానిని తప్పుగా అర్ధం చేసుకోరాదని సూచించింది. కానీ ఈ కేసుపై సోమవారం విచారణ జరిపినప్పుడు, ప్రజల దేశభక్తిని పదేపదే నిరూపించుకొనవసరం లేదని, దేశభక్తిని ఎవరూ భుజాల మీద మోయమని బలవంతం చేయరాదని జస్టిస్ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పడం విశేషం. అంటే అప్పుడు సరి అనుకొన్నది ఇప్పుడు సరికాదని ఒప్పుకొన్నట్లు భావించవచ్చు. 

వాస్తవానికి దేశభక్తి అనేది ప్రదర్శన వస్తువు కాదు. అది ప్రతీ పౌరుడి అంతరంగంలో ఉండే ఒక భావన మాత్రమే. కనుక దానిని గొప్పగా బయటకు ప్రదర్శించినవారు మాత్రమే దేశభక్తులు, ప్రదర్శించనివారు దేశద్రోహులు అనుకోవడం అవివేకమే. గత ఏడాది సుప్రీంకోర్టు ‘జనగణమన’ పై తీర్పు చెప్పినప్పుడు దేశంలో అనేకమంది ప్రముఖులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తాజా తీర్పుతో ఇది ఇంకా సంక్లిష్టంగా మారే ప్రమాదం కనబడుతోంది. సినిమా థియేటర్లలో జనగణమన ప్రదర్శించబడుతున్నప్పుడు లేచి నిలబడనవసరం లేదని చెప్పింది కనుక కొంతమంది కూర్చోవచ్చు. దానిని గౌరవించడం మన బాధ్యత అని భావించే మరికొందరు ప్రేక్షకులు లేచి నిలబడవచ్చు. ప్రేక్షకులలో అన్నిమతాల వారు ఉంటారు కనుక సహజంగానే ఇది మత సమస్యగా మారవచ్చు. 

ప్రజలలో దేశభక్తి పెంపొందించాలనుకోవడం చాలా మంచి ఆలోచనే కానీ అందుకు ఇది సరైన వేదిక కాదు సరైన పద్దతీకాదని చెప్పకతప్పదు. కనుక వినోదం కోసం సినిమాలు ప్రదర్శించే ధియేటర్లలో జనగణమన జాతీయగీతం ప్రదర్శించడం, మళ్ళీ దానిని కొందరు గౌరవించడంలేదని బాధపడటం అవసరమా ఆలోచించాలి. 


Related Post