నోట్లు రద్దు చేయడం వలన చాలా లాభాలు ఉంటాయని కేంద్రప్రభుత్వం చెపితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి వంతపాడాయి. చివరికి ఏమయిందో చూశాక అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత ఏకీకృతపన్ను విధానం (జి.ఎస్.టి.) అమలులోకి రావడం వలన సామాన్య ప్రజలకు చాలా మేలు కలుగుతుందని కేంద్రప్రభుత్వం చెపితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి వంతపాడాయి. కానీ చివరకి దాని పరిస్థితి కూడా అలాగే తయారయింది. ఈ రెండు విఫల ప్రయోగాల వలన అందరి కంటే ఎక్కువ నష్టపోయింది సామాన్యుడే. దేశంలో సామాన్య ప్రజలే వాటికి బారీ మూల్యం చెల్లించారు. ఇంకా చెల్లిస్తూనే ఉన్నారనేది చేదు నిజం.
నిత్యావసర వస్తువులను జి.ఎస్.టి. నుంచి మినహాయించినందున వాటి ధరలు బారీగా తగ్గుతాయని కేంద్రప్రభుత్వం నమ్మబలికింది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జి.ఎస్.టి. మినహాయింపబడిన ఏ వస్తువుల ధరలు తగ్గలేదు కానీ జి.ఎస్.టి. పేరుతో అనేక వస్తువులు, సేవలపై వ్యాపారులు సామాన్య ప్రజలను నిలువునా దోచుకొంటున్నారు. వారి దోపిడీని అడ్డుకొనే ఆసక్తి, యంత్రాంగం ప్రభుత్వాల వద్ద లేనందున వ్యాపారులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఈ సంగతి జి.ఎస్.టి. వాతలు పడిన ప్రతీ సామాన్యుడికి తెలుసు. ప్రభుత్వాలకు కూడా తెలుసు. వాటిని నడిపే రాజకీయ నాయకులకు కూడా తెలుసు. కానీ ఎవరూ జి.ఎస్.టి.దోపిడీని అడ్డుకొనే ప్రయత్నం చేయరు. కానీ అది తమకు రాజకీయ ఆయుధంగా ఉపయోగపడుతుందని తెలిస్తే తప్పకుండా ఉపయోగించుకొంటారు.
రాహుల్ గాంధీ కూడా అదే చేస్తున్నారిప్పుడు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో జి.ఎస్.టి.ఆయుధాన్ని భాజపా సర్కార్ పై ప్రయోగిస్తూ, “జి.ఎస్.టి. అంటే ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని కొత్త అర్ధం చెప్పి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ మంచి ఉద్దేశ్యంతో దానికి మద్దతు ఇచ్చి పార్లమెంటులో జి.ఎస్.టి.బిల్లు ఆమోదానికి సహకరిస్తే, మోడీ సర్కార్ ఆ పేరు చెప్పి సామాన్య ప్రజలను దోచుకొంటోందని అన్నారు.
రాహుల్ గాంధీ చెపుతున్న ‘గబ్బర్ సింగ్ టాక్స్’ ప్రజలకు సులువుగా కనెక్ట్ అవుతోంది కనుక దాని గురించి ఆయన చెప్పే మాటలను వినడానికి కూడా గుజరాత్ ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. తమిళ సూపర్ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమాలో కూడా జి.ఎస్.టి.పై రెండు పంచ్ డైలాగులు పెట్టేసరికి అది కూడా సూపర్ డూపర్ హిట్ అవడం, దానిపై తమిళ సినీ పరిశ్రమకు, భాజపాకు మద్య వివాదం చిలికి చిలికి గాలివానవడం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక జి.ఎస్.టి. వలన సామాన్య ప్రజలకు తప్ప మిగిలిన అందరికీ ఎంతో కొంత లబ్ది కలుగుతోందని స్పష్టం అవుతోంది.