టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలవడం, ఆ తరువాత స్వంతపార్టీ నేతలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం ద్వారా తెదేపా తలుపులు స్వయంగా మూసేసుకొన్నట్లయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో తెదేపా నేతలు అందరూ ఆయనపట్ల స్పష్టంగా వ్యతిరేకత ప్రదర్శించినప్పటికీ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నందున రేవంత్ రెడ్డి ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత రాలేదు. చంద్రబాబు నాయుడు ఈనెల 26వ తేదీన విజయవాడ తిరిగివస్తారు. కనుక ఆ మరునాడే రేవంత్ రెడ్డి ఆయనను కలిసి మాట్లాడాలనుకొంటున్నారు. అయితే పార్టీని వీడి వెళ్లిపోవడానికి సిద్దమై, పార్టీ నేతలను విమర్శించినందున చంద్రబాబు నాయుడు ముందుగా ఆయనను కలిసేందుకు ఇష్టపడతారా లేక ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో తెదేపా నేతలతో సమావేశమయ్యి వారి అభిప్రాయలు తీసుకొన్నాక ఏమైనా నిర్ణయం తీసుకొంటారా? అనేది తెలియవలసి ఉంది.
ఈనెల 27వ తేదీ నుంచే తెలంగాణా శాసనసభ, మండలి సమావేశాలు మొదలుకాబోతున్నాయి. కనుక ఆలోగానే రేవంత్ రెడ్డి తాడోపేడో తేల్చుకోవలసి ఉంటుంది. కధ ఇంత వరకు వచ్చిన తరువాత రెండు రాష్ట్రాలలో తెదేపా నేతలు వ్యతిరేకిస్తున్నప్పుడు, రేవంత్ రెడ్డిని పార్టీలో కొనసాగడానికి చంద్రబాబు నాయుడు అనుమతించడానికి అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కనుక దీనిపై స్పష్టత రాగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరుతున్నట్లు ప్రకటన చేయవచ్చు.
అప్పుడు శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల పక్కన కూర్చోవడానికి స్పీకర్ అనుమతించవలసి ఉంటుంది. లేకుంటే ఏమవుతుందో మళ్ళీ సస్పెన్స్. కనుక మరొక నాలుగు రోజులలో రేవంత్ రెడ్డి వ్యవహారం అనేకమలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.