తెలంగాణాలో రెడ్డి రాజ్యస్థాపన?

October 20, 2017


img

ఒకప్పుడు..ఇప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నేతలదే డామినేషన్. ఉత్తం కుమార్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి..ఇలాగ చెప్పుకొంటూపోతే పెద్ద జాబితాయే ఉంది. అయితే తెలంగాణా ఏర్పాటులో రెడ్డి నేతలు, జనాభా ఎక్కువగా ఉన్న రాయలసీమ వేర్పడటం, 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో రెడ్డి సామ్రాజ్యానికి అడ్డుగోడ పడింది. కనుక మళ్ళీ తమ సామ్రాజ్య స్థాపన కోసం పునరేకీకరణ అవసరం అయ్యింది. 

అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డిని దగ్గరకు తీసి తమపై ఉసిగొల్పుతోందని తెరాస నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉత్తం కుమార్ రెడ్డి ఆయన చెయ్యి పట్టుకొని డిల్లీ వరకు తీసుకువెళ్ళారు. కానీ ఈ పునరేకీకరణ హడావుడిలో పార్టీలో బీసి నేతలను విస్మరించడంతో వారిప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసిన రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావలసిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నిస్తుంటే, అయన రాకతో తమ పదవులకు లేదా టికెట్స్ కు ఎసరు వచ్చే ప్రమాదం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే రాజకీయ పునరేకీకరణ తప్పదని రేవంత్ రెడ్డి స్వయంగా చెపుతున్నారు. అయితే అది రెడ్డి నేతల ఏకీకరణగా మారితే, ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ముసలం పుట్టవచ్చని గ్రహిస్తే మంచిది. కేసీఆర్ కమ్మ సామాజిక వర్గాన్ని ఆకర్షించడం ద్వారా తెరాసను ఇంకా శక్తివంతం చేయాలనీ భావిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి కేంద్రంగా మారుతోంది. సెక్యులర్..సోషలిస్ట్ అంటూ నిత్యం వల్లెవేసే రాజకీయ పార్టీలు ఈవిధంగా కులబలంపై ఆధారపడాలనుకోవడం విచిత్రమే.


Related Post