హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు జరిగిన తెదేపా పోలిట్ బ్యూరో సమావేశానికి రేవంత్ రెడ్డి కూడా హాజరవడంతో ఊహించని పరిణామాలు జరిగాయి. ఈ సమావేశంలో తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు రేవంత్ రెడ్డితో నేరుగా వాగ్వాదానికి దిగారు.
“పార్టీ అనుమతి లేకుండా డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని ఎందుకు కలిసావు? దానికి నీ సంజాయిషీ ఏమిటి? పార్టీలో ఉండాలనుకొంటున్నావా..లేదా? ఉండాలనుకొంటే తక్షణమే బయటకు వెళ్ళి నేను పార్టీలోనే కొనసాగుతాను. కాంగ్రెస్ పార్టీలో చేరుతానని వస్తున్న వార్తలను ఖండించు,” అని మొహమాటం లేకుండా అందరి ముందు రేవంత్ రెడ్డి మొహం మీదనే చెప్పేశారు.
మోత్కుపల్లి ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పకుండా తాను అన్ని విషయాలు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే నేరుగా మాట్లాడుతానని చెప్పి సమావేశం నుంచి మద్యలో లేచి వెళ్లిపోయారు. దానితో తెదేపా నేతలు కూడా సమావేశం ముగించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
మోత్కుపల్లి నరసింహులు మీడియాతో మాట్లాడుతూ, “మేము అడిగిన ఏ ప్రశ్నకు రేవంత్ రెడ్డి సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేకపోయారు. అన్నీ పార్టీ అధినేత చంద్రబాబుతోనే మాట్లాడుతానని చెప్పదలచుకొన్నప్పుడు ఆయన ఈ సమావేశానికి ఎందుకు వచ్చినట్లు? చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీని అప్పగిస్తే, ఈ మూడేళ్ళలోనే పార్టీని సర్వనాశనం చేసేశాడు. ఓటుకు నోటు కేసులో డబ్బు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. పార్టీలో 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. పార్టీ ఎంతగా బలహీనపడిందంటే గ్రేటర్ ఎన్నికలలో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేని దుస్థితి ఏర్పడింది. దానికి రేవంత్ రెడ్డే కారణం.
ఆయన తెదేపాకు పట్టిన చీడపురుగు వంటివాడు. ఆయన వెళ్ళిపోతే పార్టీకి ఏమీ కాదు..మెల్లగా బాగుపడుతుంది. తెదేపాలో అతని కంటే బలమైన నేతలు చాలా మందే ఉన్నారు. అందరం కలిసి పార్టీని కాపాడుకోగలము.
అయినా కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి వంటివారి కంటే ఈయన పెద్ద పోటుగాడా? ఏమి చూసి ఆయనను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవాలనుకొంటున్నారో తెలియదు కానీ రేవంత్ రెడ్డిని తీసుకొంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా భ్రష్టు పట్టిపోవడం ఖాయం.
ఇన్నాళ్ళుగా రేవంత్ రెడ్డి ఎలా ప్రవర్తించినప్పటికీ సహిస్తూ వచ్చాము. ఈరోజు కూడా ఆయన చేసినపనికి మేము క్షమాపణలు అడగలేదు. బయటకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని మీడియాకు చెప్పి రమ్మనమని కోరాము. ఆయన దానికీ అంగీకరించలేదంటే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దపడ్డాడని అర్ధం అవుతోంది. మరి ఆ మాత్రం దానికి ఈ సమావేశానికి రావడం ఎందుకు? ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోవడం కాదు మేమే ఆయనను తక్షణం పార్టీలో నుంచి తొలగించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కోరుతాము,” అన్నారు మోత్కుపల్లి.