టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్చించేందుకు హైదరాబాద్ లో తెదేపా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం రేవంత్ రెడ్డి వ్యవహారం గురించి చర్చించడానికి కనుక ఆయన దీనికి హాజరుకారని అందరూ భావించారు. కానీ ఆయన కూడా హాజరయ్యి కొత్త ట్విస్ట్ ఇచ్చారు.
ఈ సమావేశానికి హాజరయిన తెదేపా నేతలకు ఆయన ఎదురుగా ఆయన గురించి చర్చించడం ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే వారికంటే ఆయన తెదేపాను వీడిపోతునందుకు లేదా విడిచిపెట్టిపోవాలని గట్టిగా కోరుకొంటున్న మీడియాలో ఒకవర్గం ఎక్కువ షాక్ అయినట్లు అవి ప్రచురించిన వార్తలు చూస్తే అర్ధం అవుతుంది.
కీలకమైన ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి మొహం చాటేయకుండా ధైర్యంగా హాజరయ్యి తన అభిప్రాయాలను చెప్పాలనుకోవడం మెచ్చుకోవలసిన విషయమే. రేవంత్ రెడ్డి తన వాదనను బలపరుచుకొనేందుకు, ఇదివరకు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను పార్టీ నేతలకు గుర్తు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితులను బట్టి అందుకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని బాబు స్వయంగా చెప్పారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో తెదేపా ఏ పార్టీతో చేతులు కలపాలనే దానిపై పార్టీ నేతలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పుడు, రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడానికి తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనబడుతున్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కానీ మోత్కుపల్లి వంటివారు కొందరు తెరాసతో చేతులు కలపడం మంచిదని అంటున్నారు. అయితే ఏ పార్టీతో చేతులు కలిపినా, విలీనం అయినా తెలంగాణాలో తెదేపా తన ఉనికిని కోల్పోవడం ఖాయం అని చెప్పవచ్చు. టిటిడిపి నేతలందరికీ కూడా ఈ విషయం బాగానే తెలుసు. కనుక పార్టీని కాపాడుకోవడానికి ఏమి చేస్తారో చూడాలి.