తెలంగాణాలో ఇంకా తెదేపా ఉనికి కనబడుతోందంటే అందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న ఒంటరి పోరాటాలే కారణమని చెప్పవచ్చు. అటువంటి వ్యక్తి కుంటిసాకులు చెపుతూ హటాత్తుగా పార్టీకి గుడ్ బై చెప్పేసి తమ రాజకీయ విరోధి అయిన కాంగ్రెస్ పార్టీలోకి చేరాలనుకోవడం సహజంగానే అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది. ఈ వ్యవహారంపై మీడియా, రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషించి తెర వెనుక కారణాలను చూపుతున్నారు. దీనిపై మైతెలంగాణాలో ప్రచురించిన విశ్లేషణాత్మక కధనాలపై మా పాఠకులు కూడా చాలా లోతుగా విశ్లేషిస్తూ అభిప్రాయలు వ్యక్తం చేయడం విశేషం.
రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నట్లేనా? అనే శీర్షికన మైతెలంగాణాలో ప్రచురించబడిన విశ్లేషణపై శ్రీ పురుషోత్తమరెడ్డి మద్ది అనే ఒక పాఠకుడు వెలిబుచ్చిన అభిప్రాయలు చాలా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఆయన ఏమి వ్రాసారంటే, “ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలన్నీ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెదేపా-కాంగ్రెస్ పార్టీలు పరస్పర అవగాహనతో చేస్తున్నవే. కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు పలుకడం లేదా తెదేపాను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా తెలంగాణాలో కేసీఆర్ ను ఎదుర్కోవడం, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన కారణంగా ఏపిలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కాంగ్రెస్ ఓట్లను తెదేపాకు బదలాయించబడే విధంగా సహకరిస్తుంది. చంద్రబాబు నాయుడు చాలా ముందు చూపుతో వేసిన మాస్టర్ ప్లాన్ ఇది,” అని వ్రాశారు.
2014 ఎన్నికలకు ముందు తెలంగాణాను ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ అధికారంలోకి రావచ్చునని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అందుకోసం విజయావకాశాలు లేని ఏపిలో కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టిన సంగతి తెలిసిందే. నేటికీ ఏపి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోగా ఇంకా దయనీయంగా మారింది. కానీ ఏపితో పోలిస్తే తెలంగాణాలో బలంగా ఉంది. పైగా కేసీఆర్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు కాంగ్రెస్ తో చేతులు కలుపడానికి ముందుకు వస్తున్నాయి. కనుక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఈసారి కూడా ఏపిలో దాదాపు నిర్జీవంగా మారిన కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం వెనుకాడబోదని వేరే చెప్పనవసరం లేదు. 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి తెదేపాకు గట్టి సవాలు విసిరే అవకాశం ఉంది కనుక దానిని తట్టుకొని నిలబడాలంటే రాష్ట్రంలో బలమైన కాంగ్రెస్ నేతల సహాకారం కూడా పొందగలిగితే మంచిదని చంద్రబాబు నాయుడు భావిస్తే ఆశ్చర్యం లేదు. ఏపిలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణాలో తెదేపా పరిస్థితి ఇంచుమించు ఒక్కలాగే ఉన్నాయి. కనుక ఏపిలో కాంగ్రెస్, తెలంగాణా తెదేపాలను పణంగా పెట్టాలనుకొంటే ఆశ్చర్యం లేదు.
చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి శత్రువు ముఖ్యమంత్రి కేసీఆరే. కనుక ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ తెదేపాలు ఈలోపాయికారి ఒప్పందం చేసుకొని ఉండవచ్చని, కానీ తెలంగాణాలో కాంగ్రెస్, తెదేపాలు నేరుగా పొత్తులు పెట్టుకొంటే రాజకీయంగా రెండు పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు, ఊహించని సమస్యలు పుట్టుకురావచ్చు కనుక రేవంత్ రెడ్డి చేత తెదేపా మీద తిరుగుబాటు చేయించి, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినట్లు చూపిస్తున్నారని శ్రీ పురుషోత్తమరెడ్డి మద్ది అభిప్రాయంకావచ్చు.