రాజకీయ నేతలు పార్టీలు మారేటప్పుడు ముందుగా కొన్ని స్టాండర్డ్ డైలాగ్స్ పలుకుతుంటారు. వాటిలో మొట్టమొదటిది ‘నేను పార్టీ మారడం లేదు’ అనేది కూడా ఒకటి. ఆ మాట రేవంత్ రెడ్డి నిన్ననే చెప్పేశారు కనుక తరువాత చెప్పవలసిన రొటీన్ డైలాగులు కూడా మెల్లగా చెప్పడం మొదలుపెట్టారు. పార్టీ మారడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొంటున్నట్లుగా ఈరోజు అయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణాలో కేసీఆర్ సర్కార్ పై చేస్తున్న పోరాటాలలో గత కొంతకాలంగా కాంగ్రెస్ నేతలతో కలిసి పనిచేస్తున్నప్పుడు, ఈవిషయంలో ఏవిధంగా ముందుకు సాగాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడితే తప్పేమిటి? తెలంగాణాలో ఇప్పుడు పార్టీలు లేవు. ఒకటి కేసీఆర్. రెండు ఆయన వ్యతిరేకులు. రెండే వర్గాలున్నాయి. కేసీఆర్ పై పోరాటంలో కలిసి పనిచేయడానికి వచ్చేవారందరూ నా దృష్టిలో ఓకే పార్టీ క్రింద లెక్క.
ఇక్కడ మేము తెరాస సర్కార్ తో ఇంతగా పోరాడుతుంటే అక్కడ ఆంధ్రాలో తెదేపా నేతలు చేస్తున్నదేమిటి? పరిటాల శ్రీరాం పెళ్ళికి కేసీఆర్ వస్తే ఆయనకు తెదేపా నేతలు వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరమేముంది? వారు చంద్రబాబు నాయుడును పట్టించుకోరు కానీ కేసీఆర్ కు గులాం అంటారు. అలా ఎందుకు చేస్తారో అందరికీ తెలుసు. ఆంధ్రా ప్రజలు తిరస్కరించిన రాజకీయ నాయకుడు పయ్యావుల కేశవ్. అసలు తెలంగాణలో ఏపీ మంత్రులకు పనేంటి? అని నిలదీశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి తెలంగాణ సీఎం కేసీఆర్ రూ. 2 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని అన్నారు. ఇలా కాంట్రాక్టు తీసుకున్న యనమల.. కేసీఆర్ మీద ఈగ నైనా వాలనిస్తారా? ఇక్కడ నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ కు ఏపీ నేతలు దండం పెడతారా? ఏపీ నేతలు అన్నం పెటిన వాళ్ళకే సున్నం పెడుతున్నారు. అసలు కేసీఆర్‌కు ఏపీ నేతలు అంతగా మర్యాద చెయ్యాల్సిన అవసరమేంటి? పరిటాల శ్రీరాం పెళ్లిలో కేసీఆర్‌కు వంగి వంగి దండాలు పెట్టారు. అంత సీన్ చేయడం అవసరమా? అదే చంద్రబాబు ఇక్కడికి వస్తే.. కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. హైదరాబాద్‌లో పరిటాల శ్రీరాం, పయ్యావుల అల్లుడి భాగస్వామ్యంతో బీర్ల తయారీ కంపెనీకి లైసెన్స్ ఎలా వచ్చింది? అక్కడ తెదేపా నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహం వలన ఇక్కడ మేము తలెత్తుకొని తిరుగలేకపోతున్నాము. మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీయాత్ర నుంచి తిరిగివచ్చిన తరువాత తెరాస పట్ల తెదేపా వైఖరి ఏమిటో ఆయననే అడిగి తెలుసుకొంటాను. అప్పుడే తదనుగుణంగా నిర్ణయం తీసుకొంటాను,” అని రేవంత్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి తన వైఖరి ఏమిటో దాదాపు స్పష్టం చేసినట్లే భావించవచ్చు. కనుక ఇప్పుడు తెదేపా స్పందించవలసి ఉంది. ఇటువంటి సందర్భాలలో పార్టీలు ఏవిధంగా స్పందించాలనే దానికి కూడా కొన్ని నిర్దిష్టమైన డైలాగ్స్ ఉన్నాయి. “పార్టీలో ఒక నేత వెళ్ళిపోయినంత మాత్రాన్న ఏమీ నష్టం లేదు..పార్టీ నేతల మీద కాదు...కార్యకర్తల మీద ఆధారపడి నడుస్తుంది,” వంటి డైలాగ్స్ రేపు అటు నుంచి వినబోతున్నాము. వీటితో శాస్త్రబద్ధంగా తలాక్ ప్రక్రియ పూర్తయిపోతుంది. ఆనక కండువాలు మార్చుకోవడమే.