తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వచ్చిన వార్తలను ఆయన, పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఇద్దరూ ఖండించినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజగోపాలరెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ‘కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం వంటిది..దానిలో ఎవరైనా చేరవచ్చు’ అని చెప్పడం విశేషం.
ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలంటే ఆయన పాపులారిటీకి, హోదాకు తగ్గ ఏదో పదవి ఇవ్వక తప్పదు. అప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఆగ్రహం కలగడం, దాంతో మళ్ళీ పార్టీలో లుకలుకలు ప్రారంభం కావడం ఖాయమే.
అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో కోమటిరెడ్డి, జానారెడ్డి వంటి కొందరు సీనియర్ నేతలతో ఉత్తంకుమార్ రెడ్డికి విభేదాలున్న కారణంగా, అయన తన స్థానాన్ని బలపరుచుకోవడానికే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జైపాల్ రెడ్డి కూడా అందుకు సహకరించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా అందులో ఇమడటం కష్టమేనని చెప్పవచ్చు. తెదేపాలో మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను కాదని రేవంత్ రెడ్డి తనంతట తానుగా అడుగు ముందుకు వేయలేరు. అందుకు కోమటి రెడ్డే ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన పార్టీ తరపున పాదయాత్రలు, బహిరంగ సభలు ఏర్పాటు చేద్దామనుకొన్నా అనుమతి లభించడం లేదు. అటువంటి ఆలోచనలు చేసినందుకే ఆయనపై డిల్లీకి పిర్యాదులు వెళ్ళడంతో కుంతియా ఆయనను గట్టిగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. తెదేపాలో పూర్తి స్వేచ్చ, తిరుగులేని అధికారం అనుభవిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇటువంటి పరిణామాలను జీర్ణించుకోగలరనుకోలేము.
అయితే వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో తెరాస తరువాత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే విజయావకాశాలున్నందునే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో చేరాలనుకోవడం సహజమే కానీ పార్టీలో ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే అపార రాజకీయానుభవం కలిగిన రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియవనుకోలేము. కనుక మంచిచెడ్డలను, లాభనష్టాలను బేరీజు వేసుకొనే అడుగు ముందుకు వేస్తారని భావించవచ్చు. ఒకవేళ ఆయన పార్టీ మారడం ఖాయం అయితే అది రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమైన పరిణామమే అవుతుంది.