రెండూ ప్రభుత్వ పధకాలే..కానీ ఎంత తేడా?

October 18, 2017


img

తెరాస సర్కార్ అట్టహాసంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ పధకం ఏవిధంగా రసాబాసగా ముగిసిందో అందరూ చూశారు. చీరలు చాలా నాసిరకంగా ఉన్న కారణంగా అనేకమంది మహిళలు వాటిని తీసుకోకపోవడంతో వారికి పంచాల్సిన ఆ చీరలన్నీ గోదాములలో మిగిలిపోయాయి. ప్రభుత్వం మొత్తం ఒక కోటి నాలుగు లక్షలకు పైగా చీరలు తెప్పిస్తే వాటిలో సుమారు 94.76 లక్షల చీరలు పంపిణీ చేశారు. ఇంకా 9.70 లక్షల చీరలు మిగిలిపోయాయి. ప్రభుత్వం వాటిని ఏమి చేస్తుందో తెలియదు. 

ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశ్యంతో ఈ పధకం చేపట్టినప్పటికీ, చీరల తయారీకి తగినంత సమయం లేకపోవడం, వాటి కొనుగోలు వ్యవహారంలో పర్యవేక్షణ లోపం కారణంగా ప్రభుత్వానికి తీరని అప్రదిష్ట కలిగింది. చీరల తయారీ, వాటి నాణ్యతపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన ప్రభుత్వం, ఈ పధకం గురించి అతిగా ప్రచారం చేసుకోవడం వలన బతుకమ్మ చీరలకు హైప్ క్రియేట్ చేసినట్లయింది. దానితో లబ్దిదారులైన మహిళలు వాటి గురించి చాలా గొప్పగా ఊహించుకొని వస్తే అవి వారి అంచనాలకు దరిదాపులలో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వారిని ప్రతిపక్షాలే రెచ్చగొట్టాయని ఆరోపిస్తూ ఈ సమస్య నుండి బయటపడేందుకు తెరాస సర్కార్ ప్రయత్నించినప్పటికీ గోదాములలో మిగిలిపోయిన 9.70 లక్షల చీరలు అసలు విషయాన్ని బయటపెడుతున్నాయి. అదే.. కేసీఆర్ కిట్స్ పధకంపై ప్రతిపక్షాలు కూడా ఒక్క విమర్శ చేయలేకపోయాయి. ఎవరూ దానిని వేలెత్తి చూపలేదు. నేటికీ అది విజయవంతంగా నడుస్తోంది. దాని వలన ప్రభుత్వానికి మంచి పేరువస్తోంది. ఈ రెండూ తెరాస సర్కార్ పధకాలే కానీ ఒకటి ప్రభుత్వానికి తీరని అప్రదిష్ట కలిగిస్తే మరొకటి మంచి పేరు తెచ్చి పెడుతోంది. అంటే పధకాల గురించి గొప్పగా ప్రచారం చేసుకొనే ముందు వాటిని సమర్ధంగా అమలుచేయడంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టడం చాలా అవసరమని ఈ రెండు పధకాలు నిరూపిస్తున్నాయి. 


Related Post