తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం డిల్లీలో ఉన్నారు. ఆయన డిల్లీ ఎందుకు వెళ్ళారో తెలియకపోవడంతో అయన తెదేపాకు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అనంతపురంలో పరిటాల శ్రీరాం వివాహానికి హాజరైనప్పుడు, తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తో తెరాస, తెదేపా పొత్తుల గురించి మాట్లాడారని వార్తలు వచ్చాయి. తెలంగాణాలో తాము తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేస్తుంటే, ఏపిలో తెదేపా నేతలు కేసీఆర్ తో చనువుగా మెలగడం వలన తెలంగాణా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అయ్యిందని ఆరోపిస్తూ మొదటి నుంచి తెరాసను వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి తదితర తెలంగాణా తెదేపా నేతలు రాజీనామాలకు సిద్దపడ్డారని వార్తలు వచ్చాయి. దాంతో అలర్ట్ అయిన చంద్రబాబు నాయుడు పయ్యావుల కేశవ్ ను మందలించారు.
అయితే తెలంగాణాలో తెదేపా పరిస్థితి బాగోలేదు కనుక తెరాసతో చేతులు కలపాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు, అందుకు కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తుండటంతో, ఆ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి తెదేపాకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఉద్దేశ్యంతోనే డిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని ఇక్కడ మీడియా కోడై కూస్తోంది.
ఈ వార్తలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ తాను తెదేపాను విడిచిపెట్టి వేరే పార్టీలో చేరే ఉద్దేశ్యం లేదని, ఎప్పటికీ తెదేపాలోనే కొనసాగుతానని అన్నారు.
ఆయన గత కొంతకాలంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి తెరాస సర్కార్ పై పోరాటాలు చేస్తున్నందున వారి మద్య సాన్నిహిత్యం ఏర్పడి ఉండవచ్చు. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో తెదేపా విజయం సాధించడం అసాధ్యం కనుక ఆ అవకాశాలు కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరాలనుకొంటే ఆశ్చర్యం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అంటే 'అనేక కత్తులున్న ఒర' వంటిది. కనుక ఆ కత్తులతో రేవంత్ రెడ్డి సర్దుకుపోగలరా? అంటే అనుమానమే. కానీ తన రాజకీయ భవిష్యత్ కూడా చూసుకోవలసి ఉంటుంది కనుక కాంగ్రెస్ పార్టీలోనో లేదా మిత్రపక్షమైన భాజపాలోనో చేరినా ఆశ్చర్యం లేదు.
ఒకవేళ ఆయన పార్టీని వీడితే ఇక తెలంగాణా తెదేపా దుకాణం బంద్ అవడానికి ఎంతో కాలం పట్టదు. ఎందుకంటే ఆయనలాగ తెలంగాణాలో తెరాస సర్కార్ తో గట్టిగా పోరాడుతున్న వారెవరూ పార్టీలో కనబడరు. అప్పుడు పొత్తుల ఆలోచనలు ఎవరూ చేయనక్కరలేదు. అయితే ఆయన పార్టీ మారడం గురించి మీడియాలో వస్తున్న ఈ ఊహాగానాలే నిజమో లేకపోతే అయన చెప్పిన మాటలే నిజమో త్వరలోనే తెలిసిపోతుంది.